ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:07 IST)

గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ

schools
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తొలుత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీఆర్‌ను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. 
 
ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నంబరును నమోదు చేసి ఆపై వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన జిల్లాను నమోదు చేయడంతో ఓటీఆర్ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుపడుతుంది. 
 
ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో తగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజును చెల్లించి, మిగిలిన వివరాలను భర్తీ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, గురుకులాల్లో మొత్తం 9231 పోస్టులకు గురుకుల నియామక బోర్డు ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే.