టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు చెందిన వ్యూహాత్మక విభాగం టీసీఎస్ అయాన్, ప్రీమియర్ టెక్నికల్, వొకేషనల్ విద్య, శిక్షణ సంస్థ నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్(ఎన్‌టీటీఎఫ్)లు భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా అత్యధిక డిమాండ్ కలిగిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రోబోటిక్స్, ఆటోమేషన్, తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో వినూత్నమైన ఫిజిటల్ నమూనాలో ప్రారంభించింది. టీసీఎస్ అయాన్ దీనిని అభివృద్ధి చేసింది.
టీసీఎస్, ఎన్‌టీటీఎఫ్‌లు ఇప్పుడు 3 డిప్లొమా, 12 సర్టిఫికెట్ కోర్సులను అందించనున్నాయి. ఈ కోర్సులన్నీ కూడా దేశవ్యాప్తంగా 60 వేల మంది విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించడం, నైపుణ్యాభివృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నాయి. తద్వారా ఆ విద్యార్థులను ప్రస్తుత, భావి పరిశ్రమల అవసరాలకనుగుణంగా ఉద్యోగాలకు సంసిద్ధం చేయనున్నాయి. ఇటీవల చేసిన విద్యా సంస్కరణలు, పరిశ్రమ నిర్వచిత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ అభ్యాస కార్యక్రమాలను నైపుణ్య అంతరాలను పూరించే లక్ష్యంతో టీసీఎస్ అయాన్ ప్రారంభించింది. నమోదు చేసుకున్న విద్యార్థులు ఏ సమయంలో అయినా, ఎక్కడి నుంచైనా, పరిశ్రమ, ఎన్‌టీటీఎఫ్‌కు చెందిన అత్యుత్తమశ్రేణి శిక్షకుల మార్గనిర్దేశకత్వంలో నేర్చుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసిన టీసీఎస్ అయాన్ అభ్యాస, ప్రాక్టీస్ కేంద్రాల వద్ద తగిన అనుభవం పొందే అవకాశమూ ఉంది.
టీసీఎస్ అయాన్ యొక్క ఫిజిటల్ మోడల్ అభ్యాస వాతావరణాన్ని సమూలంగా మార్చడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్క్ మరియు మల్టీమీడియా డిజిటల్ అభ్యాస వనరులను మిళితం చేస్తుంది. ప్రత్యక్ష ఆన్‌లైన్ లెక్చర్స్‌ను ఎన్‌టీటీఎఫ్ అందిస్తుంది. ఈ కార్యక్రమాలు ప్రస్తుత విద్యార్ధులతో పాటుగా పలు ఐటీ,పాలిటెక్నిక్స్ మరియు నైపుణ్యాభివృద్ధి సంస్ధలకు చెందిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా టీసీఎస్ భాగస్వామ్యంతో అందిస్తారు.
టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి మాట్లాడుతూ, భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవా పరిశ్రమ ప్రస్తుతం ఉన్న 23.5 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి ఆరు రెట్లు పెరిగి 152 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఈ వృద్ధిని అందుకోవడానికి దేశపు యువతకు కీలకమైన విద్యతో పాటుగా వృత్తివిద్యా నైపుణ్యం అవసరం పడుతుంది. టీసీఎస్ అయాన్ ఎన్‌టీటీఎఫ్ భాగస్వామ్యం ఇప్పుడు జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా ఉంది. ఇది భావి ఉద్యోగులు నైపుణ్యవంతులు కావడంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉత్సాహపూరితమైన కెరీర్‌లను సైతం పొందగలరు అని అన్నారు.
ఎన్‌టీటీ ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ రేగురాజ్ మాట్లాడుతూ, నైపుణ్యవంతులైన యువతకు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉంది. ఫిజిటల్ నమూనా కార్యక్రమాలను టీసీఎస్ అయాన్, ఎన్‌టీటీఎఫ్ భాగస్వామ్యంతో ప్రారంభించాము. దేశంలో యువత నడుమ నైపుణ్య అంతరాలను ఇవి పూరించనున్నాయి. దాదాపు 60 వేల మంది యువతకు నైపుణ్యం అందించడం లేదా నైపుణ్యాభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా మార్చడం మా లక్ష్యం.
ఈ వినూత్న కార్యక్రమాన్ని అవసరమైన శిక్షణను అందించడంతోపాటుగా ఎన్‌టీటీఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా కంటెంట్‌ను అందించడం ద్వారా యువతను మల్టీ లెవల్ సర్టిఫైడ్, నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దనున్నాం. తద్వారా రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దనున్నాం. ఇక్కడ విజయవంతమైన విద్యార్థులకు టీసీఎస్ అయాన్ వేదికపై అందుబాటులోని అసంఖ్యాక ఉద్యోగాలను ఎంచుకునే అవకాశం ఉంది అని అన్నారు.
భారతదేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి సంస్థలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఈ కార్యక్రమాలను ఆసక్తి కలిగిన అభ్యాసకులకు అందించవచ్చు. నూతనంగా ప్రారంభించిన కార్యక్రమాలతో పాటుగా టీసీఎస్ అయాన్ ఇప్పుడు పలు ఇతర కోర్సులను సైతం అందిస్తుంది. భారతదేశాన్ని నైపుణ్యంతో కూడిన కార్మికులు కలిగిన దేశంగా మార్చటంలో తోడ్పడటంతో పాటుగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధించేందుకు సైతం తోడ్పడనుంది.