శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (20:04 IST)

తెలుగుకు బ్రౌను చేసిన సేవలు మరువ లేనివి : డా. నిర్మలా పళనివేల

cpbrown
తెలుగు సూరీడు సీపీ బ్రౌన్ 225వ జయంతిని చెన్నై, వ్యాసర్‌పాడి మహాకవి భారతి నగర్‌లో శుక్రవారం జనని సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో భారతి మహిళా కళాశాల తెలుగు శాఖ మాజీ అధ్యక్షురాలు డా.నిర్మలా పళనివేలు మాట్లాడుతూ బ్రౌన్ మహనీయులు చిరస్మరణీయులని తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువలేనిది మరపురానిదన్నారు. ఆంగ్లేయులకు వేమన సిద్ధాంతాలను తెలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 
 
సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం పూర్వ కార్యదర్శి యర్రభనేని పట్టాభిరామయ్య తమ ప్రసంగంలో బ్రౌన్ దొర జయంతిలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఆంగ్లేయుడైవుండి కూడ తెలుగుకు ఆయన సేవ అపారమైనదని కొనియాడారు. నిఘంటువు తీసుకురావడం ఆయన ఘనతేనని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా డా.ప్రణవి రాసిన "విచిత్ర మనిషి", "భైరవ తీర్పు" పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ చలన చిత్ర గేయ రచయిత భువనచంద్ర ఫోను ద్వారా వినిపించిన తన సందేశంలో ప్రణవి రాసినవి, రాస్తున్నవి సమాజానికి ఉపయోగపడే రచనలేనని అభిప్రాయపడ్డారు. 
 
ప్రస్తుత రచయితలు రాసే రచనలకు ప్రణవి రచనలు భిన్నమైనవని చెప్పారు. విచిత్ర మనిషి నవలను నాకంకితమివ్వడం సంతోషంగా వుందని అన్నారు. ముందుగా బ్రౌన్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. తమిళనాడు విద్యాశాఖ విశ్రాంత సంచాలకులు డా.సి.పళనివేలు, జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, బ్రౌన్ సేవలను కొనియాడారు.