శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

నర్సు నిర్లక్ష్యం : ఒకేసారి రెండు డోసుల టీకా వేసిన నర్సు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు కరోనా టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందే తడువు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటూ వచ్చాయి. ఈ ప్రయాణంలో వైద్యులు, వైద్యారోగ్య సిబ్బంది చేసిన త్యాగాలను యావత్తు ప్రపంచం కీర్తించింది.
 
అదేసమయంలో కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ నర్సు చేసిన నిర్వాకం వైద్యవర్గాలకే తలవంపులు తెచ్చేలా నడుచుకుంది. 
 
శనివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా అక్బర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన కమలేశ్‌ కుమారి అనే 50 ఏళ్ల మహిళ కరోనా తొలి డోసు కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ నర్సు ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. 
 
ఓవైపు ఫోన్‌లో మాట్లాడుతూనే పరధ్యానంలో కమలేశ్‌కు రెండు సార్లు టీకా ఇచ్చారు. దీన్ని గమనించిన కమలేశ్‌ ఆమెను ప్రశ్నించగా.. నర్సు క్షమాపణలు చెప్పాల్సింది పోయి బుకాయించే ప్రయత్నం చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు, ప్రధాన వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వారు వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు.