బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

కరోనా వైరస్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి.... ఎక్కడ?

కరోనా వైరస్ సోకిన రోగికి చైనా వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంకావడంతో ప్రస్తుతం ఈ రోగి కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు చైనాలోని జియాంగ్‌సూ ప్రావిన్సుకు చెందిన 59 యేళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. జ‌న‌వ‌రి 23వ తేదీన ఆస్పత్రిలో చేరగా, 26వ తేదీన అత‌నికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు పరీక్షల ద్వారా నిర్ధారించారు. అయితే, ఈ వైర‌స్ సోకిన‌ట్లు తేల‌క‌ముందే.. ఆ రోగికి ప‌ల్మోన‌రీ ఫిబ్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని ఊపిరితిత్తులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 
 
ఈ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన అత‌ని కుడి ఊపిరితిత్తి నుంచి సుమారు 3 వేల మిల్లీలీట‌ర్ల ర‌క్తం లీకైంది. దాదాపు చావు ఖాయం అనుకున్న స‌మ‌యంలో.. ఓ బ్రెయిన్‌డెడ్ పేషెంట్‌కు చెందిన ఆరోగ్య‌మైన లంగ్‌ను.. కోవిడ్‌19 పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను ఫిబ్రవరి 29వ తేదీన వూజీ హాస్ప‌ిట‌ల్‌లో జరిగినట్టు తెలిపారు. 
 
ఈ స‌ర్జ‌రీతో అత్యంత సంక్లిష్ట‌మైన స‌మ‌యంలో.. క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స‌లో భాగంగా ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయ‌వ‌చ్చు అన్న ఓ ఆలోచ‌న‌కు వ‌చ్చారు. అయితే ఆ రోగి ఊపిరితిత్తులో వైర‌స్ ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. కోవిడ్‌19 పేషెంట్ల‌కు ఇలాంటి స‌ర్జ‌రీ చివ‌రి నిమిషంలో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న అభిప్రాయాల‌ను డాక్ట‌ర్లు వ్య‌క్తంచేశారు.
 
ప్ర‌స్తుతం ట్రాన్స్‌ప్లాంట్ అయిన రోగి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ది. అయితే లైఫ్ స‌పోర్ట్ సిస్ట‌మ్‌పై ఉన్న అత‌న్ని ఇంకా ప‌రీక్షిస్తున్నారు.   ఒక‌వేళ ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌స్తే, భ‌విష్య‌త్తులో కోవిడ్‌19 పేషెంట్లు.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.