గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (16:13 IST)

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు... లాక్‌డౌన్‌ను పాటించని ప్రజలు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఈ ఆదేశాలను తుంగలో తొక్కేసి, వీధుల్లోకి వచ్చిన సంచరిస్తున్నారు. ప్రజలు వ్యవహారశైలిపై అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ అయ్యాయి. లాక్‌డౌన్ పాటించని ప్రజలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించాయి. 
 
మరోవైపు, దేశంలో క‌రోనా (కోవిడ్‌-19) కేసుల సంఖ్య‌ క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉంది. ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌న దేశంలోనూ కోర‌లు చాస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించినా, రాష్ట్రాల‌వారీగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నా క‌రోనా మ‌హ‌మ్మారి మాత్రం క‌ట్ట‌డి కావ‌డంలేదు. కేసులు, మ‌ర‌ణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నానికి 415 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
ఇదిలావుంటే, అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 89 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. సోమ‌వారం ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇక‌ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏడు క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించగా అందులో ముగ్గురు మ‌హారాష్ట్రకు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. 
 
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా 3,45,289 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14924 మంది చనిపోగా, 99078 మంది కోలుకుని తమ ఇళ్ళకు వెళ్లారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 231287 కాగా, ఇందులో మైల్డ్ కండిషన్‌లో ఉన్న కేసులు 220654గా ఉంది. ఇకపోతే, 114002 క్లోజ్డ్ కేసులు కాగా, వీరిలో 99078 మంది కోలుకుని ఇంటికెళ్లారు. 
 
మరో 14924 మంది చనిపోయారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల లెక్కల ప్రకారం అమెరికాలో 35070 కేసులు నమోదుకాగా, వీటిలో 1524 కేసులు కొత్తవి ఉన్నాయి. మొత్తం 458 మంది చనిపోగా కొత్తగా 39 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీలో మృత్యువాతపడిన వారి సంఖ్య 5476 ఉండగా, చైనాలో 3270 మంది ఉన్నారు.