భారత్‌లో కరోనా కేసులు 12,380 - తెలంగాణాలో 700 క్రాస్
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు 12,380 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు పేర్కొంది. అలాగే, దేశవ్యాప్తంగా 414 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారనీ, 1,488 మందికరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపింది. వీరిని మినహాయిస్తే 10,477 యాక్టివ్ కేసులున్నాయి.
ఇకపోతే, దేశంలో కరోనా కేసులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల మూడో తేదీ వరకు పొడగించిన విషయం తెల్సిందే. పైగా, కేసులు ఎక్కువగా నమోదైన, నమోదవుతున్న హాట్‌స్పాట్ కేంద్రాలపై దృష్టిని కేంద్రీకరించింది. ఇందులోభాగంగా, దేశంలో 170 జిల్లాలను కరనా హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించింది. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఈ నిబంధనలు ఈ నెల 20వ తేదీ వరకు మరింత కఠినంగా అమలుకానున్నాయి. ఆ తర్వాత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాలకు సడలింపులు అమల్లోకి రానున్నాయి. రెడ్ జిల్లాలుగా ప్రకటించిన 170 జిల్లాల్లో 14 రోజుల్లో కొత్తగా కేసులేవి నమోదు కాకుంటే వాటిని ఆరెంజ్ జోన్‌లోకి మారుస్తారు. ఆ తర్వాత 14 రోజుల పాటు కొత్త కేసులేవీ లేకుంటే గ్రీన్ జోన్‌లోకి మారుస్తారు.
ఇలా ఒక జిల్లా రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి రావాలంటే 28 రోజులపాటు కొత్తగా కేసులేమీ నమోదు కారాదు. అప్పుడే ఆ జిల్లాను కరోనా సోకని జిల్లాగా ప్రకటిస్తారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు.. భౌతిక దూరంగా పాటిస్తూ నడుచుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు 700 మార్కును దాటినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాగే, కరోనా రోగులకు చికిత్స చేసేందుకు వీులుగా గచ్చిబౌలి ఆస్పత్రిలో పడకల సౌకర్యాన్ని 1500కు పెంచామనీ, ఈ ఆస్పత్రి ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినప్పటికీ.. ఏ ఒక్కరూ ఆందోళన చెందనక్కర్లేదన్నారు. అలాగే, రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లతో పాటు ఎన్95 మాస్కులను తయారు చేస్తున్నామననీ వీటిని వైద్యులు, నర్సులతో హెల్త్ వర్కర్లకు అందజేస్తామని మంత్రి ఈటల తెలిపారు.