శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 మే 2020 (14:35 IST)

కరోనాకు మందు కనిపెట్టానంటూ దాన్ని తనపైనే ప్రయోగించుకున్నాడు, మరణించాడు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను చంపేందుకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా చెన్నైలో కరోనాను కట్టడి చేసేందుకు తను మందును కనుగొన్నానంటూ 47 ఏళ్ల శివనేసన్ అనే ఫార్మసిస్ట్ ఒకరు ఆ మందును తనపైనే ప్రయోగించుకుని ప్రాణాలు కోల్పోయాడు.  
 
ఈ ఘటన డాక్టర్ ఇంట్లో జరగడంతో, ఫార్మసిస్ట్‌తో పాటు మందులు తయారుచేయడంలో డాక్టర్ కూడా పాల్గొన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెరుంగుడి స్థానికుడైన శివనేసన్ ఉత్తరాఖండ్‌లోని ప్రొడక్షన్ మేనేజర్‌గా ప్రైవేట్ బయోటెక్ ల్యాబ్‌లో పనిచేశాడు. ఆ తర్వాత చెన్నైలో అదే కంపెనీకి చెందిన శాఖలో పనిచేస్తూ వున్నాడు.
 
గత రెండు నెలలుగా కరోనా వైరస్ పనిపట్టాలని అతడు మందును కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెపుతున్నారు. ఈ క్రమంలో చివరకు తను అనుకున్న మందును కనిపెట్టేశానంటూ చెన్నైలోని తేనాంపేటలోని ఒక డాక్టర్ ఇంటికి మందును తీసుకువచ్చాడు.
 
ఆ మందును డాక్టర్ రాజ్‌కుమార్ కొంత మోతాదులో సేవించగా శివనేసన్ ఎక్కువ తినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనితో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.