శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (09:46 IST)

తెలంగాణాలో 805 - ఆంధ్రప్రదేశ్‌లో 625 కరోనా పాజిటివ్ కేసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత వేసవికాలంలో బెంబేలెత్తించిన ఈ వైరస్.. ఇపుడు శాంతించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి లోపే ఉంటున్నాయి. 
 
ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 948 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,57,278 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,455కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 131 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 58 కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే, ఏపీలోనూ ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శనివారం సాయంత్రం వెల్లడైన బులెటిన్‌లో ఒక్క కృష్ణా జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రెండంకెల్లోనే కరోనా కేసులు వచ్చాయి. 
 
కృష్ణా జిల్లాల్లో 103 కొత్త కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 16, కడప జిల్లాలో 19, అనంతపురం జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 22, నెల్లూరు జిల్లాలో 24 కేసులు వచ్చాయి. 
 
గడచిన 24 గంటల్లో 49,348 కరోనా టెస్టులు నిర్వహించగా 625 మందికి కరోనా నిర్ధారణ అయింది. 1,186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 5 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,981కి పెరిగింది.
 
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,67,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,48,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,571 మంది చికిత్స పొందుతున్నారు.