1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (13:58 IST)

దేశంలో 82 రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు.. ఏపీలో తగ్గిన కేసులు

దేశంలో గత 82 రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభమైన కరోనా రెండో వేవ్‌లో ఇప్పటివరకు 1,09,68,039 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 82 వేల మంది కరోనాతో మరణించారు. కాగా దేశంలో కరోనా కేసులు గతేడాది జనవరి 30న ప్రారంభమయ్యాయి. 
 
అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే తొలి దశలో కోటి కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే, రెండో దశలో కేవలం 82 రోజుల్లోనే కోటి 10 లక్షల కేసులు రికార్డయ్యాయి.
 
ఏపీలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 12,749 మంది కోలుకున్నారు. 73 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 12,45,374కు పెరిగాయి. 10,50,160 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,86,695కు చేరాయి. 8519 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో లక్షా 424 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.