బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (10:33 IST)

CoronaVirus ఉసురు తీస్తోన్న మహమ్మారి: 3,46,786 కొత్త కేసులు, 2,624 మరణాలు

దిల్లీ: రెండోదశలో కరోనావైరస్‌ కనికరం లేకుండా కాటేస్తోంది. శ్వాసవ్యవస్థ మీద దెబ్బకొట్టి.. రోగుల ఉసురుతీస్తోంది. రికార్డు స్థాయిలో సంక్రమిస్తూ, వైద్య వ్యవస్థను కుప్పకూల్చుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ కల్లోల పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,53,569 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..3,46,786 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

వరుసగా మూడో రోజు కేసుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న 2,624 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481 చేరగా, ఇప్పటివరకు 1,89,544 మంది ప్రాణాలు విడిచారు. క్రియాశీల కేసులు 25 లక్షలకు పైబడ్డాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 14.93శాతానికి పెరిగింది.

ఆక్సిజన్‌, పడకల కొరత అంటూ వార్తలు వస్తోన్న తరుణంలో ఈ కేసుల పెరుగుదల భారత్‌కు గట్టిదెబ్బే. అయితే నిన్న ఒక్కరోజే 2,19,838 మంది కొవిడ్ నుంచి కోలుకోవడం కాస్త సానుకూల పరిణామం. మొత్తంగా కోటీ 38లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. ఇక, దేశవ్యాప్తంగా నిన్న 29,01,412 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 13,83,79,832 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.
 
దిల్లీని కమ్మేస్తోన్న కరోనా..
దేశరాజధాని దిల్లీలో కరోనా వైరస్ ప్రాణాంతకంగా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో ఒక్కరోజే 28,395 మందికి వైరస్‌ సోకింది. తాజాగా శుక్రవారం 24,331 మంది కరోనా బారిన పడగా.. 348 మరణాలు సంభవించాయి.ఇంతకుముందెన్నడూ లేని రీతిలో అక్కడ కొవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సమారు 92వేల మంది కొవిడ్‌తో బాధపడుతున్నాయి. ఇది కూడా దిల్లీకి రికార్డు నంబరే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, మెడికల్ ఆక్సిజన్‌ కోసం అక్కడి ఆసుపత్రులు చేస్తోన్న అభ్యర్థనలు కలచివేస్తున్నాయి.
 
మహారాష్ట్రలో 773 మరణాలు..
కరోనా గుప్పిట్లో చిక్కుకున్న మహారాష్ట్రలో తాజాగా 773 మంది ప్రాణాలు విడిచారు. 66,836 మంది వైరస్ బారినపడ్డారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 41.61లక్షలకు పైబడింది. క్రియాశీల కేసులు ఏడు లక్షలకు చేరువై.. వైద్య వ్యవస్థకు సవాలుగా పరిణమించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో వైరస్ భారీగా విజృంభిస్తోంది.