శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: సోమవారం, 17 మే 2021 (22:33 IST)

కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్‌ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ఆక్సిజన్ కొరత కోవిడ్ బాధితులకు శాపంగా మారింది. తాజాగా 11 మంది మృతి చెందిన తిరుపతి నుంచి, రాజధాని దిల్లీ వరకూ చాలా రాష్ట్రాల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
 
గత వారం రోజుల నుంచీ కోర్టులో ఆక్సిజన్ సంక్షోభం గురించి వరుస విచారణలు జరుగుతున్నాయి.
వీటన్నిటి మధ్యా కోవిడ్-19 రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడడం తగ్గించేలా భారత ప్రభుత్వం ఇటీవల ఒక యాంటీ కోవిడ్ డ్రగ్‌కు అనుమతి ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ ఔషధం పేరు '2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్' దీన్ని క్లుప్తంగా '2-డీజీ' అంటున్నారు. డీజీసీఐ దీనిని కోవిడ్ రోగుల కోసం అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది.
 
డీఆర్డీఓకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్‌తో కలిసి తయారు చేసింది. మూడు దశల ట్రయల్స్ తర్వాత ఈ ఔషధానికి అనుమతులు ఇచ్చారు. దీనిని పూర్తిగా భారత్ తయారు చేసిన మొదటి యాంటీ కోవిడ్ ఔషధంగా చెబుతున్నారు.
 
DRDO 'కోవిడ్ మెడిసిన్'కు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదం, ట్రయల్స్ ఎప్పుడు, ఎక్కడ జరిగాయి
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ సమయంలో ఐఎన్ఎంఎఎస్-డీఆర్డీఓ శాస్త్రవేత్తలు గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ ఔషధం ల్యాబ్ ట్రయల్స్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ వారికి సహకారం అందించింది. ఆ సమయంలో ఈ 2-డీజీ డ్రగ్‌ కరోనా వైరస్ గ్రోత్‌ను అడ్డుకోడానికి సహకరిస్తుందని తాము నిరూపించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
ఐఎన్ఎంఎఎస్-డీఆర్డీఓకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు డాక్టర్ సుధీర్ చందన, డాక్టర్ అనంత్ భట్ దీనిపై పనిచేశారు. వీరిలో డాక్టర్ సుధీర్ చందన బీబీసీ ప్రతినిధి సత్ సింగ్‌తో ఈ ఔషధం గురించి మాట్లాడారు. "గత ఏడాది దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన సమయంలో హైదరాబాద్ వెళ్లిన డాక్టర్ అనంత్ దీనిపై ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. అంతకుముందు కూడా డీఆర్డీఓ ల్యాబ్‌లో వేరే వ్యాధుల క్లినికల్ ట్రయల్స్‌లో ఈ డ్రగ్ ఉపయోగించాం. బ్రెయిన్ ట్యూమర్ రోగులకు రేడియో థెరపీలో కూడా మేం దీనిని ఉపయోగించాం. తర్వాత ఫేజ్ త్రీ ట్రయల్స్ కోసం మా టెక్నాలజీని డాక్టర్ రెడ్డీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాం" అని చెప్పారు.
 
డాక్టర్ చందన ప్రస్తుతం ఐఎన్ఎంఎఎస్-డీఆర్డీఓ రేడియేషన్ బయోసైన్సెస్ విభాగం హెడ్‌గా పనిచేస్తున్నారు. మొదటి దశ ల్యాబ్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా డీజీసీఐ దీనికి ఫేజ్ 2 ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. అవి కూడా 2020లో మేలోనే ప్రారంభమయ్యాయి.
 
ఐఎన్ఎంఎఎస్-డీఆర్డీఓ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీతో కలిసి రెండో దశ ట్రయల్స్‌ నిర్వహించాయి. ఆరు నెలలపాటు జరిగిన ఆ పరీక్షల్లో కోవిడ్-19 రోగులు త్వరగా కోలుకోవడానికి ఈ మందు చాలా సమర్థంగా పనిచేస్తుందనేది నిరూపితమైంది. ఈ డ్రగ్ రెండో దశ ట్రయల్స్ 17 ఆస్పత్రుల్లోని 110 మంది రోగులపై జరిగాయి.
 
ట్రయల్స్ ఫలితాలు
"మా రెండో దశ ఫలితాల్లో స్డాండర్డ్ చికిత్సతోపాటూ 2-డీజీ డ్రగ్ ఉపయోగించిన తర్వాత కోవిడ్-19 రోగుల్లో సగటున రెండు మూడు రోజులు ముందే వ్యాధి నయం అయినట్టు కనిపించింది" అని డాక్టర్ చందన తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా నవంబర్ 2020న డీజీసీఐ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చింది.
 
అవి 2020 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ జరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లోని 27 ఆస్పత్రుల్లో 220 రోగులపై వీటిని చేశారు. వాటిలో దిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల ఆస్పత్రులు ఉన్నాయి.
 
"మూడో దశ ట్రయల్స్ ఫలితాల్లో కోవిడ్-19 రోగుల లక్షణాలు వేగంగా మెరుగుపడ్డాయి. అందులో 42 శాతం మందికి స్టాండర్డ్ కేర్‌తోపాటూ 2-డీజీ డ్రగ్ కూడా ఇచ్చారు. మూడో రోజు నుంచే వాళ్లు ఆక్సిజన్ మీద ఆధారపడడం తగ్గుతూ వచ్చింది. 65 ఏళ్లకు పైబడిన రోగుల్లో కూడా అదే ట్రెండ్ కనిపించింది" అని డాక్టర్ చెప్పారు. నిజానికి మూడో దశ ట్రయల్స్‌‌లో పాల్గొన్న రోగులందరూ ఆక్సిజన్ మీద ఆధారపడేవారే అని చెప్పిన డాక్టర్ చందన, స్టాండర్డ్ కేర్‌లో మాత్రమే ఉంచిన రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడడం 31 శాతం తగ్గిందని తెలిపారు.
 
అంటే ఫేజ్ 2లో 110, ఫేజ్ 3లో 220 మంది రోగులపై ఈ ట్రయల్స్ జరిగాయి. ఈ డ్రగ్ ఉపయోగించడం వల్ల వచ్చిన ఫలితాల ఆధారంగానే దీనిని కోవిడ్-19 రోగులకు ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే, భారీ జనాభా ఉన్న భారత్ లాంటి దేశంలో ఇంత చిన్న శాంపిల్ సైజు సరిపోతుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
దీనికి సమాధానంగా "ఫేజ్ 2 ట్రయల్ ఫలితాలు ఎంత బలంగా ఉన్నాయంటే, ఫేజ్ 3 ట్రయల్స్‌ ఎక్కువమందిపై జరపాల్సిన అవసరం రాలేదు" అని డాక్టర్ చందన చెప్పారు.
 
ఆ తర్వాత కోవిడ్-19 రోగుల మీద దీని వినియోగానికి అనుమతి కోరుతూ డీజీసీఐకి దరఖాస్తు చేశారు. 2021 మే 1న కోవిడ్-19 డ్రగ్‌గా దీని ఎమర్జెన్సీ వినియోగానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
 
ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది
కరోనా రోగుల ఆక్సిజన్ లెవల్ తగ్గిపోవడంతోపాటూ వారి పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతుంది. అలాంటి రోగుల సమస్యలకు యాంటీ కోవిడ్ డ్రగ్ అయిన 2-డీజీని బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని చెబుతున్నారు. "ఈ డ్రగ్ ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా వైరస్ శరీరంలో మిగతా కణాలను ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ మందు అది తెలుసుకుని ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఆ వైరస్‌లోపలికే వెళ్తుంది" అని డాక్టర్ చందన చెప్పారు..
 
"శరీరంలోకి గ్లూకోజ్ ఎలా వెళ్తుందో ఈ మందు కూడా అలాగే పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్‌కు గురైన కణాల్లోకి చేరి వాటి శక్తిని తగ్గిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ వ్యాపించడం లేదా దాని గ్రోత్ ఆగిపోతుంది. రోగి ఆక్సిజన్ సపోర్ట్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటాడు". ఈ డ్రగ్ ఊపిరితిత్తుల్లోకి చేరుకుని అదే పని చేస్తుందని డాక్టర్ చందన చెప్పారు. కానీ, బలమైన ఆధారాల కోసం దీనిని మరింత స్టడీ చేయాల్సుందన్నారు.
 
ఎవరిపై ఉపయోగించవచ్చు
దీనిని ఆస్పత్రిలో ఒక మోస్తరు నుంచి తీవ్ర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులపై మాత్రమే ఉపయోగించాలి. అలాంటి రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌ లేదా ఐసీయూలో ఉంటారు. ట్రయల్స్ సమయంలో అలాంటి రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
 
ఈ డ్రగ్ ఎప్పట్నుంచి తీసుకోవచ్చు
ఈ డ్రగ్ గ్లూకోజ్ అనలాగ్. జనరిక్ మాలిక్యూల్ అని చెబుతున్నారు. అందుకే దీనిని త్వరగా తయారు చేయగలమని, అందుబాటులోకి తీసుకురాగలమని భారత ప్రభుత్వం నమ్మకంతో ఉంది.
ఈ డ్రగ్ పౌడర్‌ రూపంలో దొరుకుతుంది. దానిని గ్లూకోజ్‌లాగే నీళ్లలో కలిపి ఉపయోగించవచ్చు.
 
అయితే భారత మార్కెట్లో ఇది ఎప్పటివరకూ అందుబాటులో ఉటుందనేది డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీపైనే ఆధారపడింది. డీఆర్డీఓ ట్రయల్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇండస్ట్రీ పార్టనర్‌గా ఉంది. బీబీసీ దీనిపై మాట్లాడ్డానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీని సంప్రదించింది. కానీ అక్కడ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
 
ఈ మొత్తం ప్రక్రియలో డాక్టర్ చందనతో కలిసి పనిచేసిన, డీఆర్డీఓ మరో శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ భట్ కూడా బీబీసీతో మాట్లాడారు. సోమవారం సాయంత్రానికి దీని టైమ్‌లైన్ గురించి విస్తృత సమాచారం జారీ చేయగలమని ఆయన చెప్పారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో దానికి మూడు నాలుగు వారాల సమయం పడుతుందన్నారు.
 
ఈ డ్రగ్ ధరెంత? 2-డీజీ ఒక డోస్ ధర ఎంత?
 
అయితే, డాక్టర్ చందన ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలుగుతున్నారు. కోవిడ్-19 రోగుల పరిస్థితిని బట్టి ఇది ఐదు నుంచి ఏడు వారాల డోస్ అవసరం అంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణ, ప్రిస్కిప్షన్ లేకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న రోగులకు ఈ డ్రగ్ ఇవ్వలేమని తెలిపారు.
 
కానీ ఈ డ్రగ్ ఒక పాకెట్ ధర ఎంత ఉంటుంది అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే డాక్టర్ ఆనంద్ భట్ దీని ధర గురించి ఒక అంచనా వేశారు.
 
"ఈ డ్రగ్‌ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధర ఒక డోసుకు రూ.500 నుంచి రూ.600 ఉంటుంది. అంటే ఐదు డోసుల ముడి పదార్థాల కోసం రూ.2500 నుంచి రూ.3000 అవుతుంది. దీనిని బట్టి ఈ డ్రగ్ ఒక డోసు ఎంతుంటుంది అని అంచనాకు రావచ్చు. కానీ భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వల్ల ధర కాస్త తగ్గచ్చు కూడా" అని బీబీసీతో మాట్లాడిన డాక్టర్ ఆనంద్ భట్ అన్నారు.
ఈ డ్రగ్ ధర ఎంత ఉండాలి అనేదానిపై తుది నిర్ణయం, దానిని తయారుచేసే డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ తీసుకుంటుంది.
 
ప్రపంచవ్యాప్తంగా 2-డీజీ వినియోగం
ఒక వైరస్ మీద 2-డీజీ క్లినికల్ ట్రయల్స్ జరగడం ఇది మొదటిసారేం కాదు. కానీ, కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిన ప్రపంచంలోని మరికొన్ని దేశాలు కూడా దీనిని వినియోగిస్తున్నాయి. కానీ, ఆ సమాచారం డీఆర్డీఓ శాస్త్రవేత్తల దగ్గర లేదు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు సంబంధించినంత వరకూ ఒక పెద్ద మహమ్మారి నుంచి బయటపడ్డానికి 2-డీజీ ఔషధం వినియోగానికి అనుమతి లభించడం ఇదే మొదటిసారి.
 
ఇది ఎవరికి ఇవ్వకూడదు, 2-డీజీ డ్రగ్ ఎవరు వాడకూడదు
కోవిడ్-19 వచ్చిన రోగులు అందరూ ఈ డ్రగ్ ఉపయోగించకూడదు అని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. ఈ డ్రగ్ ట్రయల్స్ సమయంలో గర్భిణులపై, తీవ్ర కిడ్నీ వ్యాధులు ఉన్నవారిపై దీనిని పరీక్షించలేదు. అందుకే వారిపై దీన్ని కచ్చితంగా ఉపయోగించకూడదు. అయితే, మూడు దశల ట్రయల్స్ ఫలితాల ఆధారంగా ఐసీఎంఆర్ దీని వినియోగంపై త్వరలో విస్తృత మార్గదర్శకాలు జారీ చేయనుంది. అంటే, సెకండ్ వేవ్‌లో కరోనాకు గురైన రోగులపై దీన్ని ఉపయోగించడానికి ఇంకా కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.