శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (10:22 IST)

శ్రీ బ్రహ్మంగారి మాట.. ప్రపంచంలో కోటి దాటిన కరోనా కేసులు..!

కాలజ్ఞాని శ్రీ బ్రహ్మంగారి మాట నిజమైంది. ''ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను. లక్షలాది ప్రజలు సచ్చేరయ. కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడి లాగా తూగి సచ్చేరయ'' అనే మాట నిజమైంది. ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ వైరస్‌ బారినపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,43,858 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మొత్తం 5,04,410 మంది మరణించారు. కరోనా బారినపడిన వారిలో 55,53,495 మంది కోలుకోగా, 41,85,953 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. క్లోజింగ్‌ కేసుల్లో 92 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటే, 8 శాతం మంది బాధితులు చనిపోయారు.
 
ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఈ దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 26,37,077కు చేరింది. ఇందులో 1,28,437 మంది బాధితులు చనిపోగా, 10,93,456 మంది కోలుకున్నారు. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 13,45,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 57,658 మంది బాధితులు మరణించారు.  
 
నాలుగో స్థానంలో భారత్‌లో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 20 వేలకుపైగా కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5,49,197కు చేరింది. ఇప్పటివరకు 16,487 మంది మరణించగా, 2,10,936 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.