శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (09:37 IST)

అమెరికాలో 'కరోనా' మరణాల విశ్వరూపం... స్పెయిన్‌ను కబళిస్తున్న 'వైరస్'

కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకున్న అమెరికా విలవిలలాడిపోతోంది. ఈ వైరస్ కేసుల సంఖ్యలోనే కాకుండా మరణాల్లో కూడా అగ్రరాజ్యం అమెరికా సరికొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో వైరస్ ధాటికి తీవ్రభయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా, గత మూడు రోజుల్లోనే అమెరికాలో మృతుల సంఖ్య రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనం. 
 
గురువారం 1000గా ఉన్న మరణాల సంఖ్య ఆదివారం ఉదయానికి ఏకంగా 2,211కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కరోనా బాధితుల సంఖ్య 1,24,385కు పెరిగింది. కరోనా కేసులు నిన్న ఒక్క రోజే ఏకంగా 23 శాతం పెరగడం గమనార్హం. విస్తృత కరోనా పరీక్షల కారణంగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నట్టు అధికారులు తెలిపారు.
 
ముఖ్యంగా, న్యూయార్క్ నగరాన్ని కరోనా వైరస్ మరింతగా వణికిస్తోంది. దేశంలోని బాధితుల్లో సగం మంది ఈ నగరం వారే. దీంతో నగరం మొత్తాన్ని దిగ్బంధించాలని అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారిపైనే ఇప్పటి వరకు కరోనా పంజా విసరగా, తాజాగా ఇల్లినాయిస్‌లో ఓ శిశువు కరోనా కారణంగా మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
ఇదిలావుండగా, కరోనా వైరస్ స్పెయిన్‌ను కబళించింది. ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ విలయతాండవం చేస్తోంది. 24 గంటల్లోనే ఇక్కడ ఏకంగా 832 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
 
శుక్రవారం ఇక్కడ ఒక్క రోజులోనే 769 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత 24 గంటల్లోనే అంతకుమించిన మరణాలు నమోదు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 5,690కి చేరుకుంది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 72,248కి పెరగ్గా, 12,285 మంది కోలుకున్నారు. 
 
స్పెయిన్‌తో పోలిస్తే ఇటలీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ గురువారం- శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా 969 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, శనివారం పరిస్థితి కొంత నెమ్మదించడం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.