దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు : మృతులు 3874
దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే కరోనా కేసులు కాస్త పెరిగినా.. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.
గడిచిన 24 గంటల్లో 2,76,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నాలుగు రోజుల తర్వాత దేశంలో 4 వేలకు దిగువ మరణాలు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా 3,874 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది.
తాజాగా 3,69,077 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కు చేరాయి. ఇప్పటివరకు 2,23,55,440 మంది కోలుకున్నారు.
మొత్తం 2,87,122 మంది బాధితులు మహమ్మారి సోకి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 18,70,09,792 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
మరో వైపు బుధవారం దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 20,55,010 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు 32,23,56,187 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.