శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (08:32 IST)

కరోనా వ్యాక్సిన్ : నేటి నుంచి 4 రాష్ట్రాల్లో డ్రై రన్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అందుబాటులోకి వచ్చిన పలు టీకాల పంపిణీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ  టీకాల పంపిణీ కోసం సోమవారం నుంచి నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ జరుగనుంది. 
 
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇండియా సిద్ధమవుతున్న వేళ, సోమవారం అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు డ్రై రన్‌ను చేపట్టనున్నారు. 
 
ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి వ్యాధి నిరోధకతను పెంచేలా టీకా వేసే క్రమంలో వచ్చే సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది.
 
ఇందులోభాగంగా, ప్రతి జిల్లాల్లో డమ్మీ టీకాలను 100 మందికి ఇవ్వనున్నారు. డిపోల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రానికి టీకాను తెచ్చి, ఇచ్చిన తర్వాత, ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, వెంటనే ఎలా స్పందించాలి? ఏం చేయాలన్న విషయమై ట్రయల్స్ వేయనున్నారు.
 
టీకాను తీసుకోవాలంటే ఏం చేయాలన్న విషయంపై కూడా ఈ రెండు రోజుల్లో అధికారులు ఓ నిర్ణయానికి రానున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తి పేరు, చిరునామా, టీకా ఇచ్చిన అధికారి పేరు, తీసుకున్న సమయం తదితరాలను రికార్డు చేస్తారు. 
 
టీకా తీసుకున్న తర్వాత అక్కడే 30 నిమిషాలు ఉండాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ అరగంటలో ఎటువంటి దుష్ప్రభావాలు కలుగకుంటేనే పంపుతారు.
 
ఏవైనా సైడ్ ఎఫెక్ట్‌లు వస్తే వెంటనే సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్రానికి పంపడంతో పాటు, సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ, రెండు రోజుల పాటు మాక్ డ్రిల్‌లా నాలుగు రాష్ట్రాల్లో సాగనుంది. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాలను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.