శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (17:30 IST)

బ్లాక్‌, వైట్, యెల్లో ఫంగస్‌లతో బాధపడుతూ యూపీ వ్యక్తి మృతి

Ghaziabad man
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పట్టణంలో యెల్లో, బ్లాక్‌, వైట్ ఫంగస్‌లతో బాధపడుతున్న కున్వర్‌సింగ్ మరణించారు. రాజ్‌నగర్ ఏరియాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కున్వర్ సింగ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవలే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న కున్వర్‌సింగ్ అస్వస్థతకు గురికావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. 
 
మే 24 ఆయనకు ఎండోస్కోపీ నిర్వహించగా అతనిలో యెల్లో, బ్లాక్‌, వైట్ ఇలా మూడు రకాల ఫంగస్‌లు ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి రాజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే టాక్సేమియా (రక్తం విషపూరితం కావడం) కారణంగా ఆయన ఇవాళ కన్నుమూసినట్లు డాక్టర్ బీపీ త్యాగి వెల్లడించారు. కాగా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ ఫంగస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
 
బ్లాక్ ఫంగస్‌ (మ్యుకోర్‌ మైకోసిస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి దాకా బ్లాక్ ఫంగస్ ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ కేసులు కూడా బయటపడుతున్నాయి. బీహార్‌ రాజధాని పట్నాలో వైట్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 
 
భారతదేశంలో 9వేలకు పైగా  పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు మహమ్మారిలా పెరుగుతున్నాయి. అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌మైకోసిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 50 శాతం మంది మరణిస్తున్నారు. ఇన్పెక్షన్ సోకిన కంటిని తొలగించడం ద్వారా కొంత మంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు.