గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:20 IST)

త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌.. చైనా.. కానీ ప్రజలకు అదే పనిగా వేస్తే..?

వూహాన్ నగరంలో కరోనా వైరస్ పుట్టిందనే ఆరోపణలున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ను అతి త్వరలోనే తీసుకుని వస్తామని చెబుతోంది చైనా. చైనా జాతీయ ఫార్మా గ్రూప్ సినోఫార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా.. మరో వ్యాక్సిన్‌ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది. ఈ నాలుగు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో చివరి దశకు చేరుకున్నాయి. 
 
ఆఖరిదైన మూడో దశ మానవ ప్రయోగాల్లో ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. మూడు నవంబరు నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 
 
సీడీసీ బయోసేఫ్టీ నిపుణుడు గైఝెన్ వూ మాట్లాడుతూ, గత ఏప్రిల్‌లోనే తాను వ్యాక్సిన్ తీసుకున్నానని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఇక తమ దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని చైనా చెబుతోంది. వైద్య సిబ్బంది వంటి వారికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయిస్తే సరిపోతుందని భావిస్తోంది. కొవిడ్ విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి దశల వారీగా చైనాపై కరోనా దాడి జరిగిందని అన్నారు.
 
ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే విషయంలో ఖర్చులతో పాటు లాభనష్టాల వంటి అంశాలను పూర్తిస్థాయిలో గుర్తించవలసి ఉందని చెప్పింది. భారీ స్థాయిలో వ్యాక్సిన్‌లు వేస్తూ వెళితే, అరుదుగా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చైనా అధికారులు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే చైనా అతి త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.