గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (11:40 IST)

దేశంలో కరోనా ఉధృతి : కేసులు 16 లక్షలు క్రాస్

దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరో 55079 మందికి ఈ వైరస్ సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదేసమయంలో 779 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,38,871కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 35,747కి పెరిగింది. 5,45,318 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,57,806 మంది కోలుకున్నారు. గురువారం వరకు మొత్తం 1,88,32,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజులో 6,42,588 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. 
 
ఇకపోతే, తెలంగాణలో కొవిడ్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం రికార్డు స్థాయిలో 1,986 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. అలాగే, 14 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా ఇప్పటి వరకు కరోనా కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 519కి పెరగ్గా, కేసుల సంఖ్య 62,703కి పెరిగింది. 
 
కొవిడ్ నుంచి కోలుకుని నిన్న 816 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 45,388కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 16,796 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 10,632 మంది హోం, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒక్క రోజే 21,380 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,216 మంది  ఫలితాలు రావాల్సి ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,37,582 మందికి పరీక్షలు నిర్వహించారు.