శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (11:09 IST)

40 వేల మార్కును దాటిన కరోనా కేసులు - గ్రీన్‌ జోన్‌లో కలకలం

దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. గత 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2553 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, 72 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ సంఖ్యతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 1373కు చేరింది. అలాగే, దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,533కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 11,707 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 29,453 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు కర్నాటక రాష్ట్రంలో కలకలం చెలరేగింది. వారం రోజుల క్రితం గ్రీన్ జోనుగా ప్రకటించిన ప్రాంతంలో ఒక్క రోజులోనే ఏకంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. 
 
కర్ణాటకలోని దావణగెరె జిల్లాను వారం రోజుల క్రితమే కేంద్రం గ్రీన్ జోన్‌గా ప్రకటించింది. కానీ, ఆదివారం ఒక్కరోజులో 21 కరోనా పాజిటివ్ కేసులు రావడం అధికారుల్లో తీవ్ర కలకలానికి కారణమైంది. వారం రోజుల క్రితం కంటైన్మెంట్ పీరియడ్ ముగియడంతో ఈ ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. ఆపై ప్రజలు కాసింత రిలాక్స్ అయ్యారు కూడా.
 
ఈ నేపథ్యంలో దావణగెరె ప్రాంతంలోని కొందరిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో మొత్తం 164 మంది నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని పరీక్షలకు పంపారు. 21 మందిలో వైరస్ ఉన్నట్టు తేలడంతో, అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. ఎవరి నుంచి వారికి కరోనా సోకిందన్న వివరాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.