ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (08:12 IST)

జనగామ తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందని వైద్యులు వెల్లడిచారు. 
 
నిజానికి ఆయన గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చారు. దీంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, అది పాజిటివ్ అని తేలిందని వైద్యులు ప్రకటించారు. తెలంగాణలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డే. 
 
ఇతర రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్-19 బారిన పడినప్పటికీ తెలంగాణలో మాత్రం అలాంటి సంఘటనలు జరగలేదు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కరోనా బారిన పడి విజయవంతంగా కోలుకున్నారు. 
 
అయితే, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం విపక్ష డీఎంకేకు చెందిన చెప్పాక్కం నియోజకవర్గ ఎమ్మెల్యే జె. అన్బళగన్ కరోనా వైరస్ సోకి కన్నుమూసిన విషయం తెల్సిందే. దేశంలో కోవిడ్ వైరస్ సోకి చనిపోయిన తొలి ప్రజా ప్రతినిధి ఈయనే. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 164 మందికి కరోనా వైరస్ సోకింది. అలాగే 9 మంది మృత్యువాతపడ్డారు. శుక్రవారం నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 133 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక రాష్ట్రంలోని మరో 13 జిల్లాల్లో కేసు నమోదు అయ్యాయి. ఆరు జిల్లాల్లో ఒక్కో కేసులు నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో అంతకంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 4484కు చేరుకోగా, మరణాల సంఖ్య 174కు పెరిగింది. రాష్ట్రంలో 2032 యాక్టివ్ కేసులు ఉన్నాయి.