శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (20:12 IST)

జపాన్‌లో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ.. ఫైజర్ టీకాకు యూకే గ్రీన్ సిగ్నల్

ప్రపంచ దేశాల్లో శీతాకాలం రావడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. సెకండ్ వేవ్ రావడం ఖాయమని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా ఆ దేశంలో ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్-19 టీకాను అందించాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం దానికి సంబంధించిన బిల్లును కూడా పాస్‌ చేసింది. 
 
12.6 కోట్ల జనాభా టీకా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఈ బిల్లు వెల్లడిచేస్తోంది. 8.5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే లక్ష్యంతో అమెరికన్ తయారీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో జపాన్ ఇదివరకే ఒప్పందం చేసుకుంది. అలాగే 12 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను పొందనున్నట్లు ఆ దేశం తెలిపింది. 
 
ఇదిలా ఉండగా.. క్లినికల్ ప్రయోగాల్లో మంచిపని తీరును ప్రదర్శించిన మోడెర్నా, ఫైజర్ ఇప్పటికే అత్యవసర వినియోగం కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి యూకే అనుమతి మంజూరు చేసింది. దేశంలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని రెండు వారాల క్రితం జపాన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం ఈ బిల్లుకు ఆమోదం లభించింది.