ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 జూన్ 2020 (19:38 IST)

విజయా ఆసుపత్రి ఫౌండర్ బి.నాగిరెడ్డి మనవడు కరోనావైరస్‌తో కన్నుమూత

తెలుగు, తమిళ చిత్ర నిర్మాత, విజయా వాహిని స్టూడియో వ్యవస్థాపకుడు బి. నాగి రెడ్డి మనవడు శరత్ రెడ్డి శుక్రవారం ఉదయం కరోనావైరస్ కారణంగా చెన్నైలో కన్నుమూశారు. శరత్ రెడ్డి వయసు 52 సంవత్సరాలు. బి. నాగి రెడ్డి కుమారుడు విశ్వనాథారెడ్డి ఇద్దరు కుమారులలో ఆయన చిన్నవాడు.
 
కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న అతడిని వెంటనే చెన్నైలోని విజయ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శరత్ రెడ్డి తుది శ్వాస విడిచారు. విజయా ఆసుపత్రి వారి సొంతదే అయినప్పటికీ కరోనావైరస్ ముందు చేతులెత్తేసింది. దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు, కరోనావైరస్ ఎంతటి భయంకరమైనదో.
 
చలన చిత్రరంగంలో టాప్ ప్రొడ్యూసర్ అయిన బి. నాగి రెడ్డి చెన్నై నగరంలో విజయ వాహిని స్టూడియోను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇది అప్పటి ఆసియాలో అతిపెద్ద చలన చిత్ర స్టూడియో. నాగి రెడ్డి నిర్మించిన చిత్రాలు అప్పట్లో సంచలన విజయం చవిచూశాయి.
 
ఎన్టీఆర్ పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ తదితర చిత్రాలు ఆయన నిర్మించినవే. నాలుగు దశాబ్దాలలో యాభై సినిమాల దాకా నాలుగు దక్షిణ భారత భాషలలో నిర్మించారాయన. 1970 తర్వాత విజయ-వాహిని స్టూడియో మూసివేసి దాని స్థానంలో విజయ హాస్పిటల్, విజయ హెల్త్ కేర్ ప్రారంభించారు.