కోవిడ్ టీకాల ఎగుమతులపై నిషేధం లేదు : కేంద్రం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అదేసమయంలో కరోనా టీకాల పంపిణీ కూడా విస్తృతంగా సాగుతోంది.
దేశీయంగా కరోనా టీకా డిమాండ్‌ను తీర్చేందుకు.. సీరం సంస్థ కెనడాకు టీకా ఎగుమతిని నిరవధికంగా నిలిపివేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
వీటిని కేంద్రం కొట్టివేసింది. టీకాల ఎగుమతులకు సంబంధించి ఎలాంటి నిషేధమూ విధించలేదని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు 80కి పైగా దేశాలకు టీకా సరఫరా చేశామని ఆయన తెలిపారు.
దేశీయంగా దశలవారీగా టీకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. రానున్న రోజుల్లో భారత్ తన భాగస్వామ్య దేశాలకు టీకా సరఫరాను కొనసాగిస్తుంది. ఈ నిర్ణయంతో ఎలాంటి మార్పులేదు అని అప్పుడే ఆ వార్తలను సంబంధిత వర్గాలు ఖండించాయి.
తాజాగా మరోసారి ఎగుమతుల అంశంపై స్పష్టతనిచ్చాయి. జనవరి 20 నుంచి భారత్ విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తోంది. ఇప్పటివరకు 84 దేశాలకు 64 మిలియన్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు రెండు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.