శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: మంగళవారం, 25 మే 2021 (23:27 IST)

రేప‌టి నుంచి కొవాగ్జిన్ సెకండ్ డోస్, ఆనందయ్య మందుపై కూడా: అనిల్ కుమార్ సింఘాల్

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో కొవాగ్జిన్ సెకండ్ డోసులు వేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రెండ్రోజుల్లో 90 వేల మందికి కొవాగ్జిన్ సెకండ్ డోసు వేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణలో భాగంగా అన్ని జిల్లాలకు నేటి వరకూ 3 వేల ఆంపోటెరిసిన్ బి వయల్స్ అందజేశామని తెలిపారు.

కృష్ణపట్నం మందుపై రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 72,979 కరోనా టెస్టులు చేయగా, 15,284  పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 106 మంది మృతి చెందారని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా 6,264 ఐసీయూ బెడ్లు ఉండగా, రోగులతో 5,640 నిండి ఉండగా, 624 బెడ్లు ఖాళీ గా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్లు 2,122 ఖాళీ ఉండగా, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 17,061 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రెమిడెసివిర్ ఇంజక్షన్ల గురించి డిమాండ్ బాగా తగ్గిందన్నారు. గడిచిన 24 గంటల్లో 5,335 రెమిడెసివిర్ ఇంజక్షన్లను వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు సప్లయ్ చేశామన్నారు. నిన్నా మొన్నటి వరకూ ప్రభుత్వాసుపత్రుల్లో 22  వేలు అందుబాటులో ఉండేవన్నారు.  ప్రస్తుతం 41,818 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 75 వేల వరకూ ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలోనూ రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరతే లేదన్నారు. 
 
అదనంగా ఆక్సిజన్ డ్రా...
తుఫాన్ నేపథ్యంలో కేంద్ర నుంచి రోజువారీ కేటాయింపులు కంటే అదనంగా ఆక్సిజన్ ను డ్రా చేసినట్లు ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో కేంద్ర నుంచి 767 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేశామన్నారు. ఏపీకి కేంద్ర  ప్రభుత్వం రోజువారీగా ఆక్సిజన్ ను 590 మెట్రిక్ టన్నులు కేటాయిస్తోందన్నారు. తుఫాన్ ను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా 170 మెట్రిక్ టన్నులు అదనంగా డ్రా చేశామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 650 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నారన్నారు. మిగిలిన ఆక్సిజన్ ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిల్వ చేస్తున్నామన్నారు. 
 
3 వేల ఆంపోటెరిసిన్ బి వయల్స్ అందజేత...
రాష్ట్రంలో నేటి వరకూ బ్లాక్ ఫంగస్ తో ఎటువంటి మరణాలు సంభవించినట్లు సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 252 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణలో భాగంగా నేటి వరకూ 3,000 ఆంపోటెరిసిన్ బి వయల్స్ ను అన్ని జిల్లాలకు పంపించామన్నారు. గతంలో 900 వయల్స్ అందజేయగా, మంగళవారం మరో 2,100 వయల్స్ ను జిల్లాలకు అందజేశామన్నారు.  రోగులకు తక్షణమే ఈ వయల్స్ వేయాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు.
 
బుధ, గురువారాల్లో కొవాగ్జిన్ సెకండ్ డోసు పంపిణీ...
మే నెల కు సంబంధంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవిషీల్డ్ టీకాలు వచ్చేశాయని, 78 వేల కొవాగ్జిన్ డోసులు ఇంకా రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేంద్రం అందజేసిన 1,17,980 కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండగా, 90 వేల సెకండ్ డోసులు వేయాల్సి ఉందన్నారు. బుధ, గురువారాల్లో 90 వేల మందికి కొవాగ్జిన్ సెకండ్ డోసులు వేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వ నుంచి 4,35,990 కొవిషీల్డ్ డోసులు రాగా, ఏపీ ప్రభుత్వం 12,74,290 డోసులు కొనుగోలు చేసిందన్నారు.

45 ఏళ్లు నిండి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కొవిషీల్డ్ ఫస్ట్ డోసు ఇవ్వాలని ఆదేశించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి చేపట్టిన టీకా ఫస్ట్ డోస్ వేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. టీకా కేంద్రాల్లో ఎటువంటి రద్దీ లేకుండా, ఎవరికీ ఇబ్బందులు రాకుండా పోలీసు యంత్రాంగం సహకారంతో జిల్లా అధికారులు కొవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న కొవిషీల్డ్ స్టాక్ ను జూన్ 15 వరకూ ఫస్ట్ డోసుగా వేస్తామని, ఆ తరవాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్టాక్ ను బట్టి సెకండ్ డోస్ వేస్తామని తెలిపారు. 
 
కృష్ణపట్నం మందుపై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం...
కృష్ణపట్నం మందు తయారీని ఆయూష్ కమిషనర్ స్వయంగా పరిశీలించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన శాంపిళ్ల రిపోర్టులు కొన్ని వచ్చాయని, మరికొన్ని రావాల్సి ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీష్, తిరుపతి ఆయుర్వేదిక్ కాలేజీకి చెందిన నిపుణులు కృష్ణపట్నం మందును పరిశీలిస్తున్నారన్నారు.

కంటిలో వేసే మందు వినియోగంతో ఎవరికైనా నష్టం కలిగిందా అనే వివరాలు సేకరించాలని ఆయూష్ కమిషనర్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు శుక్రవారం లోగా ఆ మందుపై క్లారిటీ రాబోతోందన్నారు. అదే సమయంలో హైబాదరాబాద్ ల్యాబ్ కు పంపిన శాంపిళ్లపైనా పూర్తి స్థాయిలో రిపోర్టు వచ్చేస్తుందన్నారు.. సీసీఆర్ఎఎస్ నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కృష్ణపట్నం మందుపై మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.