శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (07:28 IST)

ముఖానికి మాస్క్ తప్పనిసరి.. లేదంటే రెండేళ్ళ జైలు.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ రెండో దశ సంక్రమణ ప్రారంభమైందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా అనేక చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించకుండా ఎవరూ బయటకు రావొద్దని, ఎవరైనా వస్తే కఠిన శిక్షలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 
 
మాయదారి కరోనా మరోసారి జడలు విప్పుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా జరిమానా విధించేలా, రెండేండ్ల జైలుశిక్ష పడేలా చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
 
మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారికపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం-2005లోని సెక్షన్‌ 51 నుంచి 60 కింద, ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. 
 
దీంతో మాస్క్‌ లేకుండా కనిపించేవారిపై కనీసం వెయ్యిరూపాయల జరిమానా విధించనున్నారు. ఆ యా పరిస్థితులను బట్టి జరిమానా మొత్తం మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. మన ఆరోగ్యం కోసం మాస్క్‌ పెట్టుకుంటే సరే.. లేదంటే మీ జేబుకు చిల్లు తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.