శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (16:29 IST)

అమెరికాలో కొత్త రకం వైరస్ వ్యాపించిందా..? చైనాలో లాక్ డౌన్

అమెరికా కరోనా వైరస్ ప్రభావంతో విలవిల్లాడుతుంది. ఇటీవలే అమెరికాలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా ప్రవేశించింది. అయితే, బ్రిటన్ రకం కరోనాకు తోడు మరో కొత్తరకం స్ట్రెయిన్ అమెరికాలో వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా మళ్లీ పెరుగుతుండడంతో ఇది అమెరికా రకం కరోనా వైరస్ వల్లనే అని గుర్తించారు. దీనిపై వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది.
 
అమెరికా రకం కరోనా స్ట్రెయిన్ తో 50 శాతం అధికంగా వ్యాప్తి ఉండొచ్చని పేర్కొంది. మాస్కులు ధరించకపోయినా, భౌతికదూరం నిబంధనలు కచ్చితంగా పాటించకపోయినా దీని ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది.
 
మరోవైపు కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో కోవిడ్ ఇప్పట్లో వీడేలా లేదు. తాజాగా బీజింగ్‌కు దక్షిణంగా ఉన్న రెండు నగరాలలో వైరస్ విజృంభణ కొనసాగుతుండడంతో లాక్ డౌన్ విధించింది. రెండు నగరాలకు రహదారులను మూసివేయడంతో పాటు పూర్తిగా రవాణా సౌకర్యాలను నిలిపివేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది.