శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (12:07 IST)

ధోనీ కూతురు జీవాను బెదిరించిన వ్యక్తి అరెస్ట్-రాంచీ పోలీసులు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాను బెదిరిస్తూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన సంగతి తెలిసిందే . ఆ కేసులో పోలీసులు 16 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైన తర్వాత ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టా అకౌంట్‌లో ఆ టీనేజర్ అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. 
 
జీవాను బెదిరిస్తూ అసభ్యకరమైన పోస్టు చేశాడు. అయితే ఆ పోస్టును చేసింది తానే అని ఆ టీనేజర్ అంగీకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. బెదిరింపు మెసేజ్‌కు సంబంధించిన అంశాన్ని కచ్ పోలీసులతో రాంచీ పోలీసులు షేర్ చేసుకున్నారు. 
 
కచ్ జిల్లాలోని ముంద్రా నుంచి ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీ పోలీసులకు అతన్ని అప్పగించనున్నారు. జీవాను హెచ్చరిస్తూ ఆ టీనేజర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.