బుధవారం, 1 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2025 (20:00 IST)

ఆసియా కప్: పాక్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పిన అభిషేక్ శర్మ

abhishek sharma
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ మరోమారు పైచేయి సాధించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన యువసంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‍తో జరిగిన కీలక మ్యాచ్‌లో చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొడుతూ, కేవలం 24 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. అభిషేక్ సృష్టించిన విధ్వంసానికి భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల అభిషేక్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. ఆరంభం నుంచే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో వరుసగా 30 పరుగుల వద్ద ఔటవుతూ వస్తున్న గండాన్ని దాటి, కీలక మ్యాచ్ అద్భుతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు.
 
ఈ ఇన్నింగ్స్ అభిషేక్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన 14 నెలల్లోనే, కేవలం 20వ ఇన్నింగ్స్‌లో 50 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఎవిన్ లూయిస్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. అంతేగాక ఆడిన బంతుల పరంగా చూస్తే (331 బంతుల్లో) ప్రపంచంలోనే అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఎవిన్ లూయిస్ 366 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.
 
ఇన్నింగ్స్ తొలి బంతికే షాహీన్ అఫ్రిది బౌలింగులో సిక్సర్ బాది అభిషేక్ మరో రికార్డు నెలకొల్పాడు. అఫ్రిది తన కెరీర్‌లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయడం ఇది 70వ సారి కాగా, అతని తొలి బంతికి సిక్సర్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అలాగే, టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికి రెండుసార్లు సిక్సర్ కొట్టిన తొలి భారత ఆటగాడిగానూ అభిషేక్ నిలిచాడు. ఇంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ఈ ఘనతను ఒక్కోసారి సాధించారు. పాకిస్థాన్‌పై అత్యంత వేగవంతమైన అర్థశతకం (29 బంతులు) సాధించిన యువరాజ్ సింగ్ రికార్డును అభిషేక్ తన మెరుపు ఇన్నింగ్స్ చెరిపేశాడు.