సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (10:31 IST)

విరాట్ కోహ్లీ క్రికెటర్ కాదు.. ఏలియన్ : పాక్ క్రికెటర్లు

wasim akram
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా, పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అయితే, ఓ అడుగు ముందుకేసి మరింతగా ప్రశంసల వర్షం కురిపించారు. విరాట్ కోహ్లీ క్రికెటర్ కాదనీ ఏలియన్ అంటూ కొనియాడారు. 
 
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, గత ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ కోహ్లీ బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించాడు. ఫలితంగా మ్యాచ్‌ను గెలిపించాడు. 
 
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక దశలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా (40)తో కలిసి కోహ్లీ అసాధారణ ఆటతీరుతో మ్యాచ్‌న భారత్‌వైపు తిప్పేశాడు. కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ గెలుపు కేవలం కోహ్లీ వల్లే సాధ్యమైందని పేర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ స్పందించారు. "మెల్‌బోర్న్‌లో కోహ్లీ ఆటతీరు చూస్తే ఓ ఏలియన్ (గ్రహాంతరజీవి)లా అనిపించాడన్నారు. మనుషుల మధ్యలో ఏలియన్స్ కూడా ఉంటారు అని అనిపించేలా కోహ్లీ బ్యాటింగ్ కొనసాగిందని అక్రమ్ కొనియాడారు. ఆధునికతరం క్రికెటర్లలో తాను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని గుర్తుచేశారు. ఛేజింగ్‌లో కోహ్లీని కొట్టే మొనగాడు లేడని గత 15 యేళ్లుగా అతడి బ్యాటింగ్ సగటే నిదర్శనమని అక్రమ్ వెల్లడించారు.