బుధవారం, 29 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (11:47 IST)

తెలుగు క్రికెటర్లపై కక్ష కట్టిన సెలెక్టర్లు... అంబటి రాయుడిపై పగ!

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, భారత క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరింది. అయితే ఈ టోర్నీ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో ఎవరైనా గాయపడితే స్టాండ్‌బై ఆటగాళ్ళకు అవకాం కల్పిస్తారు. కానీ, ప్రస్తుత ప్రపంచ కప్‌లో అలా జరగడం లేదు. ముఖ్యంగా, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పట్ల భారత క్రికెటర్లు కక్ష కట్టారు.
 
జట్టులో సీనియర్ ఆటగాడు, మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడును కాదని ఏమాత్రం అనుభవం లేని తమిళనాడు కుర్రోడు విజయ్ శంకర్‌కు చోటు కల్పించారు. ఈ టోర్నీలో విజయ్ ఆడిన మ్యాచ్‌లలో ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు. ఈ క్రమంలో అతను గాయపడటంతో ఈ టోర్నీకే దూరమయ్యాడు. అలాగే, భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చేతి వేలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
అయితే, శిఖర్ ధావన్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు కల్పించిన క్రికెటర్లు.. విజయ్ శంకర్ స్థానంలో మాత్రం స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న అంబటి రాయుడుకు మాత్రం మొండిచేయి చూపారు. పైగా, ఎలాంటి అనుభవం లేని కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్‌ను ఆగమేఘాలపై ఇంగ్లండ్‌కు పిలిపించారు. 
 
దీనికి కారణం లేకపోలేదు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నారు. ఈయన హైదరాబాద్ ఆటగాడే. ఈయన సారథ్యంలోని బీసీసీఐ సెలెక్టర్లంతా కలిసి ప్రపంచ కప్ కోసం 15మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఇందులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు దక్కుతుందని భావించారు. కానీ, సెలెక్టర్లు మాత్రం అంబటికి షాకిస్తూ విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. జట్టుకు అటు బౌలింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో పనికివస్తాడని చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. 
 
ఈ వివరణపై అంబటి రాయుడు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ ప్రపంచ కప్ టోర్నీని త్రీడీ కళ్లజోళ్లు పెట్టుకుని చూస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపగా, మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా చర్చావేదికలు కూడా నిర్వహించారు. సెలెక్టర్లు మాత్రం మౌనం వహించారు. 
 
ఈ క్రమంలో ఇపుడు విజయ్ శంకర్ గాయపడినా స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న అంబటి రాయుడిని కాదని యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. అంటే గతంలో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకునే అతనికి ఛాన్సివ్వకుండా కొత్తవారిని ఎంపిక చేశారని తెలుస్తోంది. మొత్తంమ్మీద అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇలాంటి వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న సెలెక్టర్లు తెలుగు క్రికెటర్లపై వివక్ష చూపుతూ ముందుకుసాగిపోతున్నారు.