గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (09:42 IST)

టీ20 ప్రపంచకప్‌: భారత్-పాక్ మ్యాచ్‌పై గంభీర్ ఏమన్నారంటే?

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరుకు ముహుర్తం ఖారారైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచులోనే పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ అక్టోబర్ 24న జరగనుంది. 
 
ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌, ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో మాట్లాడూతూ.. తొలి మ్యాచులోనే పాకిస్థాన్‌తో తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 
'2007 లో కూడా, మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు, మా మొదటి మ్యాచ్‌ స్కాట్లాండ్‌తో జరగాల్సింది. కానీ అది వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మా మొదటి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో జరిగింది. నేను ఇప్పుడు చెబుతోందీ అదే. టోర్నమెంట్ ప్రారంభ దశలో పాక్‌తో తలపడితే టీమిండియాకు మేలు. 
 
అదే పనిగా పాక్‌ మ్యాచ్‌ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు. దేశ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనుకోండి. ఫలితం ఎలా ఉన్నా, రెండు దేశాలు ఆరంభంలోనే ఆడబోతున్నందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను' అని గంభీర్‌ పేర్కొన్నాడు.
 
టీ20 ప్రపంచకప్ 2021 తొలి రౌండ్‌ అక్టోబరు 17న ఒమన్‌లో ఆరంభమవుతుంది. గ్రూప్‌-ఏలో శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా, ఒమన్‌ ఉన్నాయి. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ 12కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో సూపర్‌ 12 అక్టోబరు 23న మొదలవుతుంది. మెదటి రోజు గ్రూప్‌ 1 జట్లు.. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్‌ తలపడతాయి.