శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (17:07 IST)

సిడ్నీ సంగ్రామంలో ఆస్ట్రేలియా ఘన విజయం.. చేతులెత్తేసిన ధోనీ గ్యాంగ్!

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా గురువారం జరిగిన సెమీ సంగ్రామంలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా ఏడు మ్యాచ్‌లలో అదరగొట్టిన ధోనీ గ్యాంగ్... ఫైనల్ వంటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దీంతో 2011 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఈ ఓటమితో భారత జట్టు 2015 వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించింది. 95 పరుగుల తేడాతో లభించిన విజయంతో ఆస్ట్రేలియా ఈనెల 29వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మరో ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌తో తలపడనుంది. 
 
కాగా, ఆసీస్ నిర్ధేశించిన 329 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే టాపార్డర్ తేలిపోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ భారత బౌలర్లను ఆటాడుకున్న చోట, స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు సత్తాచాటారు. టీమిండియా టాపార్డర్‌ను చాపలా చుట్టేశారు. కట్టుదిట్టమైన బంతులతో టీమిండియా బ్యాట్స్‌మన్ క్రీజులో స్వేచ్చగా కదిలే అవకాశం కూడా ఇవ్వలేదు. పేస్ బౌలింగ్‌లోని అస్త్రాలన్నీ ఉపయోగించిన ఆసీస్ బౌలర్లు టీమిండియాను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. టాపార్డర్, మిడిలార్డర్‌ను చక్కని బంతులతో పెవిలియన్ బాటపట్టించారు. ఫలితంగా ధోనీ గ్యాంగ్ పరాజయంతో ఇంటి ముఖం పట్టింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (34), శిఖర్ ధవాన్ (45)లు తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రహానే - ధోనీ జంట మాత్రమే 70 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మిగిలిన ఏ ఒక్క జోడీ కూడా భారీ భాగస్వామ్యం నెలకొల్పలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ కాగా, రహానే 44, సురేష్ రైనా 7, ఒంటరిపోరాటం చేసిన ధోనీ 65, జడేజా 5, అశ్విన్ 5 చొప్పున పరుగులు చేయగా, మోహిత్ శర్మ, యాదవ్‌లు డకౌట్ అయ్యారు. 
 
అదనపు పరుగుల రూపంలో 15 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టోర్నీలో గత ఏడు మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేక పోగా.. తాను ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫుల్కనర్ 3, స్టార్క్ 2, జాన్సన్ 2 చొప్పున వికెట్లు తీయగా హాజ్లీవుడ్ ఒక వికెట్ తీశాడు. ధోనీ, జడేజాలు రనౌట్ల రూపంలో పెవిలియన్‌కు చేరారు. 
 
అంతకుముందు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఆరోన్ ఫించ్ (81), డేవిడ్ వార్నర్‌ (12)లు జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేక పోయారు. వార్నర్ జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉండగా, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్, ఫించ్‌లు ఏకంగా 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో స్మిత్ 93 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 197 పరుగుల వద్ద తన రెండో వికెట్‌ను కోల్పోయింది. 
 
ఆ వెంటనే ఆసీస్ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. 232 పరుగుల వద్ద మాక్స్‌వెల్ (23), 233 పరుగుల వద్ద ఫించ్ (81), 248 పరుగుల వద్ద క్లార్క్ (10), 284 పరుగుల వద్ద ఫుల్కనర్ (21), 298 పరుగుల వద్ద వాట్సన్ (28) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సన్ (27 నాటౌట్) సహచర బ్యాట్స్‌మెన్ బ్రాడ్ హ్యాడ్డిన్‌ (7 నాటౌట్)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగుల మైలురాయిని దాటించాడు. 
 
అయితే చివరి రెండు ఓవర్లలో జాన్సన్ బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేష్ యావద్ నాలుగు వికెట్ల తీయగా, మోహిత్ శర్మ రెండు, అశ్విన్ ఒక వికెట్ చొప్పున తీశాడు. చివర్లో జాన్సన్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ జారవిడచడంతో భారత్ ముంగిట ఆసీస్ భారీ విజయలక్ష్యాన్ని ఉంచిన విషయం తెల్సిందే.