1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2015 (12:45 IST)

సురక్షితమైన వేదికలు చూపిస్తే ఆటాడుతాం : రాజీవ్ శుక్లా

భారత క్రికెటర్లతో పాటు మ్యాచ్‌కు హాజరయ్యే ప్రేక్షకులకు సురక్షితంగా ఉండే వేదికలను చూపిస్తే పాకిస్థాన్ గడ్డపై భారత క్రికెటర్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా అంటున్నారు. 
 
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ యేడాది ఆఖరులోగా భారత్ - పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి వుంది. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనివుండటంతో భారత ప్రభుత్వం ఈ సిరీస్‌కు అడ్డు చెపుతోంది. 
 
దీనిపై రాజీవ్ శుక్లా స్పందిస్తూ పాకిస్థాన్‌లో టీమిండియా ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆటగాళ్లకు, ప్రేక్షకులకు సురక్షితమైన వేదికలు చూపించాలని కోరారు. తటస్థ వేదిక అంటూ యూఏఈని పాకిస్థాన్ ఎంచుకోవడంతో ఆ దేశంలో క్రికెట్ ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పీసీబీని హెచ్చరించారు. పాకిస్థాన్‌లోని లాహోర్ స్టేడియంకి దగ్గర్లో ఆటగాళ్లు బస చేసేందుకు సురక్షితమైన హోటల్ నిర్మించి, స్టేడియంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తే క్రికెట్ ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 
 
భద్రతపై పీసీబీ ముందుగా ఐసీసీ, ఇతర బోర్డుల అనుమతులు తీసుకుంటే ఆ తర్వాత ఆడటం గురించి మాట్లాడవచ్చన్నారు. వారు అనుమతిస్తే ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. సమయం దగ్గర పడుతుండడంతో మీనమేషాలు లెక్కించడం మానేసి భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధపడాలన్నారు. అదేసమయంలో పీసీబీకి చేకూరే నష్టాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని రాజీవ్ శుక్లా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.