1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆసియా కప్‌లో సంచలనం : శ్రీలంకను చిత్తు చేసిన ఆప్ఘనిస్థాన్

afghanistan cricket team
దుబాయ్ వేదికగా ఆసియా కప్ క్రికెట్ టోర్నీ శనివారం నుంచి ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఊహించని ఫలితం వచ్చింది. శ్రీలంక జట్టును క్రికెట్ పసికూనలైన ఆప్ఘనిస్థాన్ కుర్రోళ్లు చిత్తుగా ఓడించారు. ఆప్ఘన్ బౌలర్ల ధాటికి లంకేయులు 105 పరుగులకే కుప్పకూలిపోయారు. ఈ లక్ష్యాన్ని ఆప్ఘన్ బ్యాటర్లు కేవలం 10.1 ఓవర్లలోనే ఛేదించి సరికొత్త రికార్డును లిఖించుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ జట్టును ఆఫ్ఘన్ బౌలర్లు 105 పరుగులకే కట్టడి చేశారు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన లంకేయులు మూడో ఓవర్‌లో మరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడిపోయారు. కుశాల్ మెండిస్ (2) అసలంక (0), పాథుమ్ నిశ్శంక (3)లు దారుణంగా విఫలమయ్యారు. 
 
దీంతో తొలి మూడు వికెట్లు కేవలం 5 పరుగులకే కూలాయి. ఆ తర్వాత గణతిలక (17), రాజపక్స (38)లు కలిసి కొంత ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆప్ఘన్ బౌలర్లు మరోవైపు, గుణతిలక వికెట్ తీయడంతో వీరి భాగస్వామ్యానికి తెరదించారు. ఆ తర్వత లంక ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. ఫలితంగా 19.4 ఓవర్లలో 105 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. 
 
ఆప్ఘన్ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ మూడు వికెట్లు తీయగా, ముజీబ్, కెప్టెన్ నబీ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘన్ జట్టు 10.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 
 
ఓపెనర్లు హజ్రతుల్లా 28 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 37 (నాటౌట్), రహ్మతుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశారు. ఇబ్రహీం జద్రాన్ 15, నజీబుల్లా జద్రాన్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.