గురువారం, 16 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2024 (16:40 IST)

చాంపియన్స్ ట్రోఫీ వేదిక మారనుందా?

india - pakistan
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సివుంది. అయితే, ఈ ట్రోఫీ వేదికపై అనిశ్చితి నెలకొంది. దీనికి కారణం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు నిరాకరించడమే. భారత్ పర్యటించకుంటే ఈ టోర్నీ నిర్వహణ బోసిపోతుందని పాకిస్థాన్ క్రికెట్ వర్గాల సమాచారం. దీంతో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లన హైబ్రిడ్ విధానంలో దుబాయ్ లేదా షార్జా వంటి వేదికలపై ఆడేలా ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల కోసం క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐసీసీ సమావేశం మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. బుధవారం ఖరారు చేస్తారని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 
 
ఇలాంటి క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపు కష్టమేనని పేర్కొన్నాడు. వచ్చే యేడాది పాక్ ఆతిథ్యంలో ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ, పీసీబీ మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ క్రమంలో హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలని ఐసీసీ కూడా పీసీబీకి ఆఫర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
'ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపు లేవు. నేను కూడా అసలు జరగకూడదని కోరుకుంటున్నా. వారు (ఐసీసీ) తిరస్కరించే ముందే మీరు (పీసీబీ) వద్దని చెప్పాలి. పీసీబీ, ఏసీబీ, ఐసీసీ ఏదైనా సరే బీసీసీఐతో పోరాడలేవు. ఎందుకంటే భారత్ బాయికాట్ చేస్తుందేమోననే భయం వెంటాడుతోంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన స్టాండ్ ఎలా ఉండాలి? ఐసీసీ లేదా ఏసీబీ కలిసి వస్తాయా? అనేది ఆలోచించుకోవాలి' అని లతీఫ్ వ్యాఖ్యానించాడు. 
 
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పాకిస్థాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తుందనే అంతా అనుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో తమ మ్యాచ్‌లకూ ఇదే మోడల్‌ను అనుసరించాలని ఇప్పటికే పాక్ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 
 
"ఐసీసీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లిఖితపూర్వకమైన హామీని కోరుతోంది. భారత్ ఆతిథ్యం ఇచ్చే టోర్నీల్లో తాము మ్యాచ్ ఆడే వేదికలను హైబ్రిడ్ పద్ధతిలో ఏర్పాటు చేయాలనేది పీసీబీ షరతు. దీనిపై ఇవాళ జరగనున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది" అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.