శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

ఆటగాళ్లూ జాగ్రత్త!.. దురుసుగా ప్రవర్తిస్తే రెడ్‌కార్డే...

అంతర్జాతీయ క్రికెట్ నియమనిబంధనలను ఐసీసీ మరోసారి సవరించింది. పాతవాటిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు మరికొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల ప్రవర్తన, డీఆర్‌ఎస్, బ్యాట్ సైజ్, రనౌట్ వంటి అంశాల

అంతర్జాతీయ క్రికెట్ నియమనిబంధనలను ఐసీసీ మరోసారి సవరించింది. పాతవాటిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు మరికొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల ప్రవర్తన, డీఆర్‌ఎస్, బ్యాట్ సైజ్, రనౌట్ వంటి అంశాల్లో పలు మార్పులు చేసింది. గురువారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అంతర్జాతీయ బాడీ స్పష్టం చేసింది. 
 
దీంతో దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్, పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌లు కొత్త నిబంధనల ప్రకారం జరుగనున్నాయి. అయితే ప్రస్తుతం భారత్- ఆస్ట్రేలియా సిరీస్ మాత్రం పాత నిబంధనల ప్రకారమే జరుగనుంది. ఎంసీసీ క్రికెట్ నిబంధనలకు లోబడి కొత్త వాటిని రూపొందించామని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అల్లార్డిక్ వెల్లడించారు.
 
ఐసీసీ సవరించిన కొత్త నిబంధనల మేరకు... ఆటగాళ్ల ప్రవర్తన విషయంలోనూ ఐసీసీ ఖచ్చితంగా వ్యవహరించనుంది. మైదానంలో దురుసుగా ప్రవర్తించినా, అంపైర్లను భయపెట్టినా, భౌతికదాడికి పాల్పడినా, ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లపైన లేక ఇతరులపైన దాడి చేసినా కఠినమైన చర్యలు తీసుకోనుంది. మ్యాచ్ మధ్యలో గొడవ పడిన ఆటగాడిని మైదానం నుంచి బయటకు పంపేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వరు. అంటే ఫుట్‌బాల్ మ్యాచ్ తరహాలో రెడ్‌కార్డ్ చూపిస్తారు. 
 
డీఆర్‌ఎస్‌లోనూ మార్పులు చేసింది. టెస్టుల్లో 80 ఓవర్ల తర్వాత ఉపయోగించుకునే అదనపు రివ్యూలకు ఐసీసీ ముగింపు పలికింది. ఇక నుంచి ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు మాత్రమే రివ్యూలు ఉంటాయి. వాటినే సక్సెస్‌ఫుల్‌గా వినియోగించుకోవాలి. ఇకపై టీ20ల్లో కూడా రివ్యూలను ప్రవేశపెట్టనున్నారు. 
 
బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న ఫీల్డర్ కచ్చితంగా లైన్ లోపలే ఉండాలి. బయటకు అడుగుపెట్టి మళ్లీ వచ్చి క్యాచ్ అందుకుంటే దాన్ని ఫోర్‌గా లెక్కిస్తారు. ఫీల్డర్, వికెట్ కీపర్ పెట్టుకున్న హెల్మెట్‌ను తాకి గాలిలోకి వెళ్లిన బంతిని క్యాచ్ పట్టినా, రనౌట్ చేసినా, స్టంపౌట్ చేసినా ఔట్‌గానే పరిగణిస్తారు.
 
రనౌట్లకు సంబంధించి ఐసీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి పరుగెత్తుతున్నప్పుడు లేదా డైవింగ్ చేసినప్పుడు మొదటిసారి బ్యాట్ క్రీజ్ లైన్‌ను తాకితే చాలు. ఆ సమయంలో వికెట్లు పడకపోతే నాటౌట్‌గా ప్రకటిస్తారు. తర్వాత బ్యాట్ గాల్లో ఉండి వికెట్లు పడినా రనౌట్ కానట్లుగానే పరిగణిస్తారు. స్టంపౌట్ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తారు. ఒక్కసారి క్రీజులో బ్యాట్ పెట్టి ఆ తర్వాత తీసేసినా సరే నాటౌట్‌గా పరిగణిస్తారు.