శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:47 IST)

వరల్డ్ కప్ : దక్షిణాఫ్రికా 408/5.. క్రిస్ గేల్ క్లీన్ బౌల్డ్....

వరల్డ్ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా 409 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు దక్షిణాఫ్రికా జట్టు రెండో ఓవర్‌లోనే తేరుకోలేని షాకిచ్చింది. జట్టు స్కోరు 12 పరుగులకు చేరగానే సౌతాఫ్రికా బౌలర్ అబాట్ తన తొలి ఓవర్ మూడో బంతికే కరీబియన్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (3)ను బోల్తా కొట్టించాడు. అబాట్ వేసిన ఆ బంతికి గేల్ క్లీన్ బౌల్డయ్యాడు. 
 
కేవలం నాలుగు బంతులెదుర్కొన్న గేల్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో కరీబియన్లు కష్టాల్లో పడ్డారు. అంతకుముందు సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ విశ్వరూపం చూపడంతో వెస్టిండీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. తాజాగా ఆ జట్టు బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టేలా ఉన్నారు. 
 
కాగా, సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డు శతకాన్ని సాధించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసిన డివిలియర్స్, వరల్డ్ కప్‌లో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 65 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడిన డివిలియర్స్ మొత్తం 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్‌‌లో నాలుగు సిక్స్‌లు బాదిన డివిలియర్స్ 30 పరుగులు రాబట్టాడు. వెరసి వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 408 పరుగులు చేసింది. 
 
అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సఫారీల ఇన్నింగ్స్‌ను హషీమ్ ఆమ్లా, డికాక్‌తో కలిసి ప్రారంభించాడు. అయితే ఆరో ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ డికాక్ (12) జాసన్ హోల్డింగ్ బౌలింగ్‌లో ఓటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆమ్లా 65, ప్లెసిస్ 62 పరుగులతో ఇన్నింగ్స్‌కు చక్కదిద్దారు. 
 
వీరిద్దరు రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం కల్పించారు. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రోస్సో 61 వద్ద ఔట్ కాగా, డీ విల్లియర్స్ 162 పరుగులు చేయగా, మిల్లర్ 20, బెహర్డియన్ 10, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, రస్సెల్‌లు రెండేసి వికెట్లు చొప్పున తీయగా, హోల్డర్ ఒక వికెట్ తీశాడు.