శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

హైడ్రామా మధ్య ఎట్టకేలకు పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు

pakistan team
వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారత్ వేదికగా ఐసీసీ ప్రవంచ వన్డే క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. అయితే, ఆ జట్టు సభ్యులకు వీసాలు మంజూరు చేసే విషయంలో జాప్యం నెలకొంది. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పీసీబీ.. ఐసీసీకి సోమవారం లేఖ రాసింది. ఆ తర్వాత హైడ్రామా మధ్య పాక్ క్రికెటర్లకు భారత ఎంబసీ అధికారులు ఎట్టకేలకు వీసాలు మంజూరు చేశారు. దీంతో ఈ నెల 27వ తేదీన దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేరుకోనుంది.
 
భారత్ వీసాలను మంజూరు చేయకపోవడంతో ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. ప్రపంచ కప్ సమయంలో పాకిస్థాన్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంది. 29వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంతవరకు వీసాలు మంజూరు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ జట్టుకు భారత్ వీసాలు మంజూరు చేసింది. మరోవైపు, వీసాల మంజూరులో ఆలస్యం కారణంగా దుబాయ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలనుకున్న టీమ్ బిల్డింగ్ ప్లాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది.