ఐపీఎల్: గుజరాత్ టైటాన్స్ బోణీ... చెన్నైకి చెక్
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)పై గుజరాత్ టైటాన్స్ (జిటి) ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. ఆఖరిలో రషీద్ ఖాన్, తెవాటియా భారీ షాట్లతో టైటాన్స్ గెలుపు బోణీ కొట్టింది.
179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92 పరుగులు) విజృంభణంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది.
ఆ తర్వాత లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు సరైన ఊపు లభించింది. సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చకచకా 25 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రాజ్యవర్ధన్ హంగార్గేకర్ 3 వికెట్లు తీశాడు.