శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:59 IST)

భూమండలంపై అత్యంత చెత్త కెప్టెన్ నేనే... ఎవరు? (video)

సాధారణంగా ప్రతి క్రికెటర్‌కు దేశానికి ప్రాతినిథ్యం వహించాలని ఉంటుంది. జట్టుకు ఎంపికై తన ప్రతిభను నిరూపించుకున్న తర్వాత దేశం తరపున ఆడే క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని భావిస్తారు. అలా అనేక మంది క్రికెటర్లు తమతమ దేశాల క్రికెట్ జట్లకు నాయకత్వం వహించి దేశానికి సేవ చేశారు. 
 
అలా సేవ చేసిన వారిలో డేవిడ్ మిల్లర్ కూడా ఒకరు. ఈయన సౌతాఫ్రికా ట్వంటీ20 జట్టు కెప్టెన్. ఈయన మదిలో తాజాగా ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచంలోనే అత్యంత చెత్త కెప్టెన్ తానేనని అనుకున్నారట. దీనికి కారణం లేకపోలేదు. 
 
దక్షిణాఫ్రికా - పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టీ20కి కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ మిల్లర్ జట్టును విజయ పథంలో నడిపించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సఫారీలు సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు కూడా. 
 
అయితే జొహెన్నెస్‌బర్గ్‌లోని వాండరెర్స్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఒకానొక దశలో 174/5తో విజయానికి చేరువైంది. 'నిజంగా అప్పుడేం చేయాలో నాకు తోచలేదు. వారు విజయానికి దగ్గరవుతున్నారు. బంతితో మేం వారిని అడ్డుకోలేకపోతున్నాం. అప్పుడనిపించింది.. ఈ భూమ్మీద నేను అత్యంత చెత్త కెప్టెన్‌నని' అని మ్యాచ్ అనంతరం మిల్లర్ వ్యాఖ్యానించాడు. 
నిజానికి ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులతో బలంగా కనిపించిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ బాబర్ ఆజం 90 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి నుంచి జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్‌కు 'ప్లేయర్ ఆఫ్ మ్యాచ్' అవార్డు లభించింది.