సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (11:57 IST)

గౌరవప్రదంగా టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసిన డేవిడ్ వార్నర్...

david warner
వార్నర్ ఓపనర్‌గా క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పడుతుంది. తన ఆధిపత్యం చెలాయిస్తూ విధ్వంసకర బ్యాటింగుతో చెలరేగిపోతాడు. అతని 12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఎన్నో అద్భుత ప్రదర్శనలు.. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు, మరిచిపోలేని వివాదాలూ ఉన్నాయి. 132 ఏళ్ల చరిత్రలో ఎలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం లేకుండా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికైన మొదటి ఆటగాడు వార్నర్ కావడం గమనార్హం. 
 
2011లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశాడు. మొత్తం 8786 పరుగులు చేయగా, ఇందులో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలున్నాయి. 2019లో పాకిస్థాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 335 పరుగులు చేసి తన సత్తా చాటాడు. తన వందో టెస్టులో (దక్షిణాఫ్రికాపై) తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు సాధించాడు. గత యేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్ జట్టులో ఉన్నాడు. 2014 నుంచి 2018 వరకు వార్నర్ కెరీర్ దూసుకెళ్లింది.
 
అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లోనూ వార్నర్ కీలక ఆటగాడిగా ఎదిగాడు. కానీ అతని దూకుడు స్వభావంతో ఆసీస్ జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తట్టుకోలేక రూట్‌పై ఓ బార్‌లో దాడి చేశాడనే కారణంతో జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. 
 
2015లో మైదానంలో వార్నర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేసిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో.. క్రికెట్లోనూ యెల్లో కార్డు, రెడ్ కార్డు నిబంధనలు తీసుకురావాలన్నాడు. 2018 టెస్టు సిరీస్‌లో డికాక్ వార్నర్ ఘర్షణకు దిగాడు. అదే సిరీస్‌లో బాల్ టాంపరింగ్‌తో ఏడాది నిషేధం, జీవిత కాలం పాటు కెప్టెన్‌కాకుండా వేటు పడింది. దీంతో అతని కెరీర్ ముగిసిందనే అనుకున్నారు. 
 
కానీ ఈ కష్ట కాలంలో ధైర్యంగా నిలబడిన అతను ఫీనిక్స్ పక్షిలా ఎగిరాడు. మళ్లీ మునుపటి జోరును అందుకున్నాడు. దూకుడు తగ్గించుకుని అందరివాడిగా మారాడు. ఐపీఎల్ కారణంగా తెలుగు రాష్ట్రాలే కాదు భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమాల్లోని పాటలు, డైలాగ్లు, హీరోలను అనుకరిస్తూ వీడియోలు చేసి ఆదరణ దక్కించుకున్నాడు. ఇప్పుడు గౌరవప్రదంగా టెస్టు కెరీర్‌కు స్వస్తి చెప్పాడు.