అనూజ్ ఒక్క క్రికెట్ మ్యాచ్‌లో కూడా ఆడలేడు.. జీవితకాల నిషేధం..
అండర్-23 క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాల నిషేధం విధించారు. ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్, సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అమిత్ భండారీపై దాడికి పాల్పడినందుకు గానూ దేడాపై ఈ జీవిత కాల నిషేధం విధించడమైంది. భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిట ఛైర్మన్ అమిత్ భండారిపై నాలుగు రోజుల క్రితం అనూజ్ బృందం దాడికి పాల్పడింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ కోసం స్థానిక స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తున్న తరుణంలో.. ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అనూజ్ బృందం దాడికి పాల్పడింది. అంతేగాకుండా ఆ బృందంలోని ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన డీడీసీఏ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యుడైన గౌతం గంభీర్ కూడా పాల్గొన్నాడు. ఈ సమావేశం అనంతరం డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. క్లబ్ మ్యాచ్‌లు సహా ఎలాంటి క్రికెట్ టోర్నీలోనూ ఇక నుంచి అనూజ్ ఆడలేడని చెప్పాడు.
డీడీసీఏ సభ్యులందరూ అనూజ్‌పై జీవితకాలం నిషేధం విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపాడు. ఇక నుంచి సెలెక్షన్స్ జరిగే ప్రదేశంలోకి ఆటగాళ్లను తప్ప ఎవర్నీ అనుమతించమని చెప్పాడు.