1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR

2019 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు పది జట్లే : డేవ్ రిచర్డ్‌సన్

2019లో జరుగనున్న ప్రపంచ క్రికెట్ పోటీలకు ఈ దఫా 10 జట్లు మాత్రమే పోటీపడే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య నిర్వహణాధికారి (సీవోవో) డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. నాలుగేళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ మెగా ఈవెంట్‌కు ఈ దపా గట్టిపోటీ ఇచ్చే జట్లను మాత్రమే ఎంపిక చేస్తామని తెలిపారు. 
 
బార్బడోస్ వేదికగా ఐసీసీ వార్షిక సమావేశం శనివారం జరిగింది. ఇందులో అనేక అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో 2019 వరల్డ్ కప్‌ను పది జట్లతోనే టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆతిథ్య ఇంగ్లండ్‌‌తో పాటు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-7 జట్లతో పాటు బంగ్లాదేశ్‌లో జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఫైనలిస్ట్‌లు టోర్నీకి అర్హత సాధిస్తాయని చెప్పారు. 
 
ఇకపోతే.. ఇక అంపైర్‌ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్‌) వాడాలా వద్దా అన్నది ఆతిథ్య దేశ ఇష్టానికే వదిలేయాలన్న పాత పద్ధతినే కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించిందని చెప్పారు. డీఆర్‌ఎస్‌ అమలుపై సమీప భవిష్యత్తులో బీసీసీఐ వైఖరిలో ఎలాంటి మార్పులేదని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే రకమైన టెక్నాలజీని వాడాలని ఐసీసీ భావిస్తున్నప్పటికీ, డీఆర్‌ఎస్‌కు భారత్‌ ససేమిరా అనడంతో ఆతిథ్య దేశాల బోర్డుల ఇష్టానికే వదిలేయాల్సి వస్తోందన్నాడు.
 
ఇకపోతే.. వన్డేల్లో బ్యాట్‌కు, బంతికి సమతూకం ఉండేలా చేసేందుకు.. బ్యాటింగ్‌ పవర్‌ప్లేను పూర్తిగా రద్దు చేసి, చివరి పది ఓవర్లలో 30 అడుగుల సర్కిల్‌కు అవతల ఐదుగురు ఫీల్డర్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా మొదటి పది ఓవర్లలో ఇద్దరు ఫీల్డర్లు క్యాచింగ్‌ పొజిషన్లలో ఉండాలన్న నిబంధననూ రద్దుచేసింది. వన్డేలతో పాటు టీ-20ల్లో అన్ని రకాల నోబాల్స్‌కూ ఫ్రీహిట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు.