సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (09:25 IST)

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma
సెమీఫైనల్‌లో తన మార్క్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అతను తన మార్క్ హిట్టింగ్‌తో టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడింది. 
 
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. భారత్‌కు శుభారంభం అందించి 9వ ఓవర్‌లో ఔటయ్యాడు. 
 
అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ అద్భుత రికార్డు సాధించాడు. ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును ఈ హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు. 
 
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన హీరోగా రోహిత్ నిలిచాడు. క్రిస్ గేల్ 34 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌ల్లో 49 సిక్సర్లు బాదితే, రోహిత్ 27 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌ల్లోనే 51 సిక్సర్లు బాదాడు. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
 
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు 28 సిక్సర్లు బాదాడు హిట్‌మన్. గ్రిస్ గేల్ 2015 ప్రపంచకప్‌లో 26 సిక్సర్లు కొట్టాడు. అతడిని ఇప్పుడు రోహిత్ శర్మ అధిగమించాడు.