ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (15:05 IST)

సౌతాఫ్రికా గడ్డపై మరో రికార్డు టీమిండియా సొంతం

team india
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భాగంగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతుంది. ఇందులోభాగంగా, బుధవారం రాత్రి సెంచూరియన్ పార్కు వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో మరో రికార్డును సొంతం చేసుకుంది. విదేశాల్లో 100వ టీ20 గెలుపుని అందుకుంది. విదేశీ గడ్డపై 100 టీ20 విజయాలు సాధించిన రెండో జట్టుగా భారత్ అవతరించింది. 
 
టీమిండియా విదేశాల్లో మొత్తం 152 టీ20 మ్యాచ్‌లలో ఆడి 100 విజయాలు సాధించింది. 43 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. కాగా ఈ జాబితాలో దాయాది దేశం పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ విదేశీ గడ్డపై 116 విజయాలు సాధించి మొదటి స్థానంలో ఉంది. 84 విజయాలతో ఆఫ్ఘనిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు విదేశాల్లో 138 టీ20లు ఆడి 84 విజయాలు అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్ సొంతగడ్డపై తక్కువ మ్యాచ్‌లు ఆడుతుంటుంది కాబట్టి మూడో స్థానంలో నిలిచింది. 
 
మరోవైపు అగ్రశ్రేణి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా విదేశాల్లో 137 టీ20 మ్యాచ్‌లు ఆడి 71 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ విదేశాల్లో 129 మ్యాచ్‌లు ఆడి 67 గెలుపులు సాధించి ఐదవ స్థానంలో ఉంది. కాగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. తిలక్ వర్మ సెంచరీ సాయంతో టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.