మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (14:09 IST)

టీమిండియాకి జరిమానా.. కారణం ఏమిటంటే..?

ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియాకి జరిమానా పడింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే టీమిండియా 166/3తో ఛేదించేసింది. దాంతో.. ఐదు టీ20ల సిరీస్‌ 1-1తో సమమవగా.. మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే మంగళవారం రాత్రి 7 గంటలకి జరగనుంది. 
 
రెండో టీ20 మ్యాచ్‌లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్‌ని టీమిండియా తక్కువగా వేసింది. దాంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద టీమిండియాకి మ్యాచ్ ఫీజులో 20% జరిమానా రూపంలో కోత విధిస్తూ.. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా కూడా ఈ తప్పిదాన్ని అంగీకరించింది. ఫస్ట్ టీ20లో పేలవ బౌలింగ్ కారణంగా ఓడిపోయిన టీమిండియా.. రెండో టీ20లో వ్యూహాత్మకంగా బౌలింగ్‌ చేసింది.
 
మరీ ముఖ్యంగా.. ఇంగ్లాండ్ హిట్టర్లు జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, బెన్‌స్టోక్స్‌ని నిలువరించేందుకు.. భారత బౌలర్లు స్లో డెలివరీలను సంధించారు. ఈ క్రమంలో బౌలర్లతో తరచూ కెప్టెన్ విరాట్ కోహ్లీ చర్చలు జరుపుతూ కనిపించాడు. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ సమయం కాస్త వృథా అయినట్లు తెలుస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఈ స్లో ఓవర్ తప్పిదానికి టీమిండియా పాల్పడితే జరిమానా రెట్టింపవనుంది.ే