ఆదివారం, 24 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (11:57 IST)

గ్వాలియర్ టీ20పై విజయంతో భారత్ ఖాతాలో చారిత్రాత్మక రికార్డు

Team India
గ్వాలియర్ వేదికగా పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. తద్వారా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్ నిర్ధేశించిన 128 పరుగుల విజయలక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి 3 మ్యాచ్‌ల సిరీస్ లో 1-0తో భారత్ ముందంజలో నిలిచింది.
 
అయితే, 128 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ మొదలుకొని హార్దిక్ పాండ్యా వరకు అందరూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టీమిండియా ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. 
 
ఏకంగా మరో 49 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. దీంతో టీ20ల్లో 100 పరుగులకు పైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే గెలుపొందిన మ్యాచ్గా ఈ విజయం నిలిచింది. 2016లో జింబాబ్వేపై 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. తాజాగా బంగ్లాదేశ్ప దానిని అధిగమించింది.
 
మరోవైపు, ఈ మ్యాచ్ ద్వారా భారత్ పేసర్ మయాంక్ యాదవ్ అరంగేట్రం చేశాడు. అలా తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతడు అరుదైన ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తన తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో 2006లో దక్షిణాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్‌పై అర్షదీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.
 
అలాగే బంగ్లాతో మ్యాచ్‌లోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ కూడా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 అత్యధిక సిక్సర్లు కొట్టిన నాలుగో బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. అతడు ఇప్పటివరకు 139 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ (137)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో 205 సిక్సులతో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ (173) ఉంటే, విండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ (144) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.