సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (12:21 IST)

సిడ్నీలో సమరం : మయాంక్ స్థానంలో రోహిత్ - మాస్క్ లేకుంటే అపరాధం

ఆస్ట్రేలియా - భారత్ టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం మూడో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టులో పలు మార్పులు జరుగనున్నాయి. వరుసగా విఫలమవుతున్న మయాంక్ అగర్వాల్ స్థానంలో డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. 
 
అలాగే, పేసర్ ఉమేశ్ యాదవ్ రెండో టెస్టులో గాయపడడంతో అతడి స్థానంలో ఎవర్ని తీసుకోవాలన్నది సమస్యగా మారింది. శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీల మధ్య ఒక పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. శార్దూల్ ఠాకూర్ కాస్తో కూస్తో అనుభవం ఉన్న బౌలర్ కాగా, సైనీ టెస్టులకు కొత్తే. 
 
అయితే, సైనీ గంటకు 140 కిమీ పైచిలుకు వేగంతో బంతులు వేస్తాడని, మొరటు బలంతో అతడు వేసే పేస్ కు ఆసీస్ బ్యాట్స్ మెన్ ఇబ్బందిపడతారని క్రికెట్ పండితులు అంటున్నారు. మరి టీమిండియా మేనేజ్ మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
 
ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లూ ఒక్కో మ్యాచ్‌లో గెలిచి విజయం సాధించి సమవుజ్జీలుగా ఉన్నాయి. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. 
 
కాగా, ఇప్పటికే భారత జట్టుకు పితృత్వ సెలవుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. గాయాలబారినపడి పేసర్ మహ్మద్ షమీ, తాజాగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌లు కూడా దూరమయ్యారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు విధిగా ముఖానికి మాస్క్ ధరించాలన్న షరతు విధించారు. ముఖ మాస్క్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఒకవేళ నిబంధన పాటించకపోతే వెయ్యి డాలర్ల అపరాధం విధిస్తామని హెచ్చరించింది. 
 
ఇదిలావుంటే, బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట ప్ర‌త్య‌క్షంగా చూడ‌టానికి వ‌చ్చిన ఓ అభిమానికి క‌రోనా సోకిన‌ట్లు మెల్‌బోర్న్ క్రికెట్ క్ల‌బ్ (ఎంసీసీ) వెల్ల‌డించింది. అయితే ఆ వ్య‌క్తికి మ్యాచ్ చూసే స‌మ‌యంలో మాత్రం ఇన్ఫెక్షన్ లేద‌ని తెలిపింది. 
 
ఈ ఘ‌ట‌న‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఇప్ప‌టికే అత‌నితోపాటు క‌లిసి మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకొని, ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ (డీహెచ్‌హెచ్ఎస్‌) ఆదేశాలు జారీ చేసింది. 
 
డిసెంబ‌ర్ 27, జ‌న‌వ‌రి 27న మెల్‌బోర్న్ స్టేడియంలోని ది గ్రేట్ స‌ద‌ర్న్ స్టాండ్‌లో కూర్చొని మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి 3.30 గంట‌ల వ‌ర‌కు మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు ఎంసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
 
మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో ప్ర‌తి రోజూ స్టేడియంలో భారీ ఎత్తున క్లీనింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హించిన‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా ఎంసీసీ చెప్పింది. ఇప్పుడా క‌రోనా సోకిన వ్య‌క్తి ఉన్న స్టాండ్స్‌ను మ‌రోసారి శానిటైజ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియంలో మొత్తం 275 శానిటైజింగ్ స్టేష‌న్ల‌ను కూడా ఏర్పాటు చేశారు.