క్యాచ్ జారవిడిచాం.. భారీ మూల్యం చెల్లించుకున్నాం : జేసన్ హోల్డర్

Last Updated: గురువారం, 15 ఆగస్టు 2019 (14:20 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నట్టు వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. భారత క్రికెట్ జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ విండీస్ జట్టు ఓడిపోయింది. దీనిపై హోల్డర్ స్పందిస్తూ, ఈ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్‌ విభాగం ఆకట్టుకున్నప్పటికీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వైఫల్యాలు కారణంగానే ఓడిపోయామని తెలిపారు.

ప్రధానంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను తమ వికెట్‌ కీపర్‌ షాయ్‌ హోప్‌ ఆరంభంలోనే వదిలేయడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. భారత్‌ ఛేజింగ్‌లో భాగంగా కీమో పాల్‌ వేసిన ఆరో ఓవర్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను హోప్‌ జారవిడిచాడు. ఆపై చెలరేగిన కోహ్లీ శతకం కొట్టిన విషయం తెల్సిందే.

'మా బ్యాటింగ్‌ విభాగం ఆకట్టుకోవడంతో గౌరవప్రదమైన స్కోరును భారత్‌ ముందుంచాం. కానీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోహ్లి 11 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడం మాకు ప్రతికూలంగా మారింది. ఇటీవల కాలంలో ఫీల్డింగ్‌ తప్పిదాలు చేయడమే మాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది' అని హోల్డర్ చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే ట్వంటీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన... బుధ‌వారం జ‌రిగిన మూడో వన్డేలో భార‌త్ 6 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మారు బ్యాట్‌తో రాణించాడు. మొత్తం 99 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 14 ఫోర్ల సాయంత్రం 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్ కూడా 41 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 65 పరుగులు చేసి కెప్టెన్‌కు మంచి సహకారం అందించడంతో మ్యాచ్ భారత్ వశమైంది.

అంతకుముందు వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆరంభంలో భారత బౌలర్లకు కరేబియన్ బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ క్రిస్‌గేల్ (72: 41 బంతుల్లో 8x4, 5x6), ఎవిన్ లావిస్ (43: 29 బంతుల్లో 5x4, 3x6) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. దీంతో ప‌ది ఓవ‌ర్ల‌లోనే స్కోరు వంద ప‌రుగులు దాటింది. ఆ త‌ర్వాత భార‌త బౌల‌ర్స్ వెంట వెంట‌నే వికెట్స్ తీయ‌డంతో వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు, మహ్మద్ షమీ రెండు, చాహల్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. వ‌రుణుడు మ‌ధ్య మ‌ధ్య‌లో ఆట‌కి అంత‌రాయం క‌లిగిస్తుండ‌డంతో మ్యాచ్‌ని 35 ఓవ‌ర్ల‌కి కుదించారు.

డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం భార‌త్ ల‌క్ష్యం 35 ఓవ‌ర్ల‌కి 255 ప‌రుగులుగా నిర్ణ‌యించారు. రంగంలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ (10) పేలవరీతిలో రనౌటవగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 36 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 36 రన్స్ చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఓపెనర్స్ ఇద్ద‌రు త్వ‌ర‌గానే పెవీలియ‌న్ బాట ప‌ట్డడంతో ఇన్నింగ్స్ ముందుకు న‌డిపే బాధ్య‌త‌ని కోహ్లీ తీసుకున్నాడు. త‌న జోరు కొన‌సాగిస్తూ మూడో వ‌న్డేలోను సెంచరీ చేయగా, శ్రేయాస్ అయ్యర్‌ సహకారంతో భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.దీనిపై మరింత చదవండి :